24-10-2025 10:28:03 PM
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): మండలంలోని దౌడపల్లి గ్రామంలో యూనియన్ బ్యాంకు వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ కరీంనగర్ రీజినల్ మేనేజర్ డి. అపర్ణ రెడ్డి మాట్లాడుతూ... ఆర్థిక సమగ్రత, డిజిటల్ లావాదేవీల ప్రాముఖ్యత, గ్రామీణ ప్రజలలో ఆర్థిక స్వావలంబన పెంపుకు ఈ సదస్సు ప్రత్యేకంగా నిర్వహించామని తెలిపారు. ప్రజా ప్రయోజన పథకాలైన ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) బ్యాంక్ ఖాతాలు తెరవడం, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన్ మంత్రి సురక్ష భీమా యోజన (పీఎంఎస్బీవై ), ఆటల్ పెన్షన్ యోజన (ఏపీవై) వంటి పథకాల గురించి సమగ్రంగా వివరించారు.
అలాగే (కేవైసీ )పూర్తి చేయని సేవింగ్స్ ఖాతాలను తక్షణమే అప్‌డేట్ చేయాలని సూచించారు. డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ సేవలు, భద్రతా ప్రమాణాలపై ప్రజలతో చర్చించారు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన (పీఎంజేజేబీవై)లబ్ధిదారులలో ఒకరైన తోగటి తిరుమల కుటుంబానికి రూ.2,00,000/- (రెండు లక్షల రూపాయల) చెక్కును యూనియన్ బ్యాంక్ కరీంనగర్ రీజినల్ మేనేజర్ డి.అపర్ణ రెడ్డి అందజేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులందరికీ సద్వినియోగం చేసుకోవడమే ప్రధాన ఉద్దేశ్యమని యూనియన్ బ్యాంక్ దౌడపల్లి శాఖ మేనేజర్ బిశ్వనాధ్ తెలిపారు.