24-10-2025 10:31:11 PM
చిలుకూరు: జాతీయస్థాయి మెడికల్ నీట్-2025 పరీక్షలో ఉత్తమ ప్రతిభ చూపి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన నిరు పేద విద్యార్థినికి కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కత్రం శ్రీకాంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు చేత వైద్య విద్యార్థినికి మొదటి సంవత్సరం ఫీజు, హాస్టల్ వసతికి రూ.90 వేలను చెక్కు రూపంలో అందించారు.
జెర్రిపోతులగూడెం గ్రామానికి చెందిన గాలి సైదులు కుమార్తె నవ్య నీట్-2025 పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 502 ర్యాంక్ సాదించింది. ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్ లో నవ్యకు హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో MBBS సీటు వచ్చింది. అయితే నిరుపేద కుటుంబానికి చెందిన నవ్య తల్లిదండ్రులకు కళాశాల ఫీజు చెల్లించేందుకు స్తోమత లేకపోవడంతో ఈ విషయం తెలుసుకున్న అనంతగిరి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కత్రం శ్రీకాంత్ రెడ్డి నవ్యకు ఎంబీబీఎస్ మొత్తం ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చారు.
ఈ క్రమంలో మొదటి సంవత్సరానికి సంబందించిన రూ.90 వేల చెక్కును శుక్రవారం జెర్రిపోతులగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో కోదాడలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ సుబ్బారావు చేతుల మీదుగా నవ్యకు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ ఒక నిరుపేద విద్యార్థిని వైద్య విద్య కలను నెరవేర్చేందుకు ముందుకు వచ్చిన కత్రం శ్రీకాంత్ రెడ్డి అభినందనీయుడన్నారు.
తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో విద్య, వైద్య సేవలు అందిస్తున్న శ్రీకాంత్ రెడ్డి సేవలను డాక్టర్ సుబ్బారావు కొనియాడారు. ఈ సందర్భంగా సాయం పొందిన విద్యార్థిని నవ్య మాట్లాడుతూ తనకు నీట్ పరీక్షలో ఉత్తమ్ ర్యాంక్ వచ్చినా తన కుటుంబ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా తాను మెడికల్ కాలేజీలో అడుగు పెడతానని అనుకోలేదన్నారు. కానీ శ్రీకాంత్ రెడ్డి వల్ల తన ఎంబీబీఎస్ కల నెరవేరుతోందన్నారు. ఆయన ఇచ్చిన స్పూర్తితో ఎంబీబీఎస్ పూర్తి చేసి తనలాంటి పేదలకు సేవ చేస్తానని తెలిపారు.