6 August, 2026 | 6:45 PM

ఆర్-3 కెనాల్ పనులకు ఇండ్లు షాపులు తొలగిస్తామంటే ఊరుకునేది లేదు

06-08-2026 05:18 PM

అఖిలపక్ష నాయకుల డిమాండ్

నేరేడుచర్ల,(విజయక్రాంతి): ఆర్-3 మేజర్ కాలువ ఆధునికరణ పనులకు అడ్డుగా ఉన్నాయనే సాకుతో  జాతీయ రహదారి వెంట గత 50 సంవత్సరాలుగా జీవిస్తున్న బడుగు బలహీన వర్గాల వారి ఇండ్లు షాపులను తొలగిస్తామంటే చూస్తూ ఊరుకోబొమని నేరేడుచర్ల పట్టణ ఆర్-3 కాలువ బాధితుల సంఘం డిమాండ్ చేసింది. నేరేడుచర్ల పట్టణ కేంద్రంలో గురువారం ఆర్ త్రీ కాలువ బాధితుల సంఘo ఏర్పాటు సమావేశంలో అఖిలపక్ష నాయకులు దొండపాటి అప్పిరెడ్డి మాట్లాడుతూ... 2022  సంవత్సరంలో జాతీయ రహదారి పనులకు అడ్డుగా ఉన్నాయని పట్టణంలో కొంతమేర షాపులు ఇండ్లు తొలగించడం జరిగింది.

అదే సమయంలో ఆర్ త్రీ కాలువ పక్కన నివసిస్తున్న ఇండ్లను షాపులను  తొలగించాలని నాడు అధికారులు ప్లాన్ చేసినప్పటికీ తాము అధికార పక్షంలో ఉండి  అడ్డుకొని ఆపించామని, ఇప్పుడు అధికారంలో ఉన్న పాలకులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి ఆపించాలని లేకపోతే భవిష్యత్తులో నేరేడుచర్ల ప్రజలు క్షమించరని గుర్తు చేశారు. అనంతరం నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు, నేరేడుచర్ల తాసిల్దార్ సురిగి సైదులు గౌడ్ లకు తమ ఇండ్లను షాపులను తొలగించవద్దని కోరుతూ అఖిలపక్ష నాయకులతో  పాటు ప్రజలు  వినతి పత్రాన్ని అందించారు.