ప్రేమ పేరుతో మోసం చేసిన మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి
జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా ఓబుల కేశవాపూర్ గ్రామానికి చెందిన మోకు మహేందర్ రెడ్డి, వడ్డెర కులానికి చెందిన మాధవిని ప్రేమ వివాహం చేసుకుని, గత ఎనిమిదేళ్లుగా ఆమెను శారీరక, మానసికంగా వేధిస్తూ వచ్చాడని జాతీయ వడ్డెర సంఘం నాయకులు ఆరోపించారు. ఈ నెల 3వ తేదీన ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. ప్రస్తుతం జనగామ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు మాధవిని జాతీయ వడ్డెర సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గండికోట సంపత్ ఆధ్వర్యంలో నాయకులు పరామర్శించారు.
ఆమెకు ధైర్యం చెప్పి, చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి జాతీయ వడ్డెర సంఘం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, మోకు మహేందర్ రెడ్డితో పాటు హత్యాయత్నానికి సహకరించిన కుటుంబ సభ్యులను వెంటనే అరెస్ట్ చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ ముఖ్య సలహాదారు పల్లపు సమ్మయ్య, రాష్ట్ర తదితర జాతీయ వడ్డెర సంఘం నాయకులు, మహిళా నాయకులు, కుల పెద్దలు పాల్గొన్నారు.






