30-01-2026 06:49:15 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): దోపిడీ రహిత సమాజ నిర్మాణమే అమరజీవి కామ్రేడ్ కొల్లు శ్రీనివాస్ రెడ్డి గారి ప్రధాన లక్ష్యమని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలు మున్నా లక్ష్మి కుమారి అన్నారు. మొండికుంట గ్రామంలో కొల్లు శ్రీనివాస్ రెడ్డి 11వ వర్ధంతిని పురస్కరించుకుని సిపిఐ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం సిపిఐ మండల సహాయ కార్యదర్శి కమటం సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో మున్నా లక్ష్మి కుమారి మాట్లాడుతూ... ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం శ్రీనివాస్ రెడ్డి బలమైన ప్రజా పోరాటాలకు నిలువుటద్దంగా నిలిచారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కవటం వెంకటేశ్వరరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు రెడ్డి అరుణ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్, మాజి ఎంఫీపీ కొల్లు మల్లారెడ్డి, పలువురు పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.