అనుమతి లేకుండా కమ్యూనిటీ హాల్ కూల్చివేత..
- ప్రభుత్వ నిధుల దుర్వినియోగం...
- ఇష్టారాజ్యంగా గ్రామ సభ తీర్మానం...
ఉట్నూర్, ఆగస్టు 6: ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలను కూల్చివేయాలంటే ఆ శాఖ ప్రభుత్వ ఉన్నత అధికారుల ఆదేశాలతో పాటు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులతో కూ ల్చివేయాలి. కానీ అధికారుల అనుమతులు లేకుండా గ్రామపంచాయతీ పరిధిలో పంచాయతీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఏకంగా నేలమట్టం చేశారు.
వివరాలలోకి వెళితే.. ఇంద్రవెల్లి మండలం దన్నోరా (బి) పంచాయతీ పరిధిలోని ఇన్కర్ గూడలో 1991-92లో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన ఐజేఆర్వై పథకం నిధులతో అప్పటి సర్పంచ్ రూ. 70 వేలతో కమ్యూనిటీ హాల్ నిర్మించారు. నాటి నుంచి ఈ నెల 3వ తేదీ వరకు గ్రామస్తులు కమ్యూనిటీ హాల్ ను సద్వినియోగం చేసుకుంటున్నారు.
దన్నోరా(బి) పంచాయతీకి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వీవో భవనాన్ని మంజూ రు చేసింది. వివో భవనానికి స్థలం లేదని గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి కమ్యూనిటీ హాల్ తొలగించి వివో భవనాన్ని నిర్మించాలని తీర్మానించారు. ఈ తీర్మానం మాత్రమే సరిపోతు, తీర్మాన పత్రాలతో పాటు కమ్యూనిటీ హాలు శిథిలావస్థకు చేరినట్లు ఇంజనీరింగ్ అధికారులతో ధ్రువ పత్రాలు తీసుకొని జిల్లా పంచాయతీ అధికారి ద్వారా జిల్లా కలెక్టర్ నుంచి భవనాన్ని తొలగించుటకు ఉత్తర్వులు తీసుకోవాల్సి ఉంటుంది.
అలాంటివేమి చేయకుండానే పంచాయతీ తీర్మానమే ముఖ్యమని ఈ నెల ఐదవ తేదీన భవనాన్ని నేలమట్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కమ్యూనిటీ హాల్ ను కూలగొట్టడం అన్యాయమంటూ ప్రజలు బాహాటంగానే పేర్కొంటున్నారు. పంచాయతీ పాలకవర్గం ప్రజల అభిప్రాయాలు సేకరించకుండానే తమ ఇష్టానుసారం వ్యవహరించారని విమర్శిస్తున్నారు. ఈ విషయ మై పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ను ‘విజయక్రాంతి’ వివరణ కోరగా గ్రామ సభ తీర్మానం మేరకే కమ్యూనిటీ హాల్ తొలగించి వివో భవనం నిర్మించుటకు స్థలాన్ని ఇచ్చామన్నారు. ఈ లెక్కన హాల్ ను కూల్చేందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోలేదని చెప్పకనే చెప్పారు.






