calender_icon.png 12 October, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణికొండలో ఆక్రమణల కూల్చివేత

09-10-2025 12:15:20 AM

600 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు

మణికొండ, అక్టోబర్ 8 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెమలినగర్‌లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాలను బుధవారం రెవెన్యూ ఉదయం అధికారులు కూల్చివేశారు. తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ ఈ ప్రక్రియ కొనసాగింది. నెమలినగర్‌లోని సుమారు 600 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఆరు కుటుంబాలు నివాసముంటున్నాయి.

దీని ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.5 కోట్లు. ఈ ఆక్రమణలపై దృష్టి సారించిన రెవెన్యూ అధికారులు మూడు నెలల క్రితమే వారికి నోటీసులు జారీ చేశారు. గడువు ముగిసినా వారు స్పందించకపోవడంతో, అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఉదయం నుంచే జేసీబీలు, రెవెన్యూ సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

తమ కళ్లెదుటే కలల గూళ్లు కూలిపోతుండటంతో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ‘మాకు కోర్టు ఉత్తర్వులున్నాయి. ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటున్నాం. పేదలపై అధికారుల తీరు ఇంత నిర్దాక్షిణ్యంగా ఉండటం దారుణం‘ అంటూ బాధితులు ఆక్రోశించారు. వారి అభ్యంతరాలను, ఆర్తనాదాలను పక్కనపెట్టి అధికారులు తమ పనిని పూర్తిచేశారు. అనంతరం స్వాధీనం చేసుకున్న స్థలం చుట్టూ రెవెన్యూ యంత్రాంగం హద్దులు ఏర్పాటు చేసింది.