calender_icon.png 12 October, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోదా కాదు.. న్యాయం కోసం పోరాటం

12-10-2025 03:36:52 AM

  1. కంచా గచ్చిబౌలి భూములను ప్రభుత్వం ఆక్రమిస్తోంది
  2. చరిత్రను విధ్వంసం చేస్తున్నారు.. న్యాయం చేయండి
  3. అసఫ్ జాహీ వంశస్థులు 9వ నిజాం రౌనక్ యార్ ఖాన్

హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 11 (విజయక్రాంతి): ఇది హోదా లేదా సంపద కోసం చేస్తున్న పోరాటం కాదు... నిజం, న్యాయం, చరిత్ర పరిరక్షణకు చేస్తున్న పోరాటం అని అసఫ్ జాహీ రాజవంశ వారసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ పూర్వీకుల చారిత్రక వారసత్వ సంపదను ప్రభుత్వం ఆక్రమిస్తూ, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తోందని వాపోయారు. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలంలోని కంచా గచ్చిబౌలి సర్వే నెం. 25, 26లో ఉన్న 2,725 ఎకరాల భూమి తమ ప్రైవేట్ ఆస్తి అని, దానిని కాపాడాలంటూ న్యాయపోరాటం చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 9వ నిజాం నవాబ్ రౌనక్ యార్ ఖాన్, ఇతర వారసులు నవాబ్ మిర్ మిలాద్ అలీ ఖాన్, నవాబ్ మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ తమ న్యాయవాది మొహమ్మద్ వేకార్ హుస్సేన్తో కలిసి మాట్లాడారు.

సుప్రీంకోర్టు సుమోటో స్వీకరణ 

ఈ భూములు చారిత్రాత్మకంగా ఏడవ నిజాం నవాబ్ మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ ప్రైవేట్ ఆస్తి అని పేర్కొన్నారు. ఈ విషయం 1950 నాటి బ్లూ బుక్ ఆఫ్ ది గవర్నర్ జనరల్‌లో స్పష్టంగా నమోదై ఉందని, వారు చారిత్రక ఆధారాలను బయటపెట్టారు. అయినప్పటికీ, ఇటీవల ప్రభుత్వం ఈ భూముల్లోకి ప్రవేశించి, పెద్ద ఎత్తున చెట్లను నరికివేస్తోందని ఆరోపించారు. ఈ అన్యాయాన్ని గమనించిన సుప్రీంకోర్టు, 2025 ఏప్రిల్ 3న ఈ కేసును సుమోటోగా రిట్ పిటిషన్ నెం. 3 ఆఫ్ 2025 స్వీకరించి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందని తెలిపారు.

చరిత్రను కాపాడండి : 9వ నిజాం

మేము కోరేది అధికారం కాదు, చరిత్రను కాపాడండి, చట్టాన్ని గౌరవించండి, అని 9వ నిజాం నవాబ్ రౌనక్ యార్ ఖాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  మా ముత్తాత ఏడవ నిజాం విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల కోసం తన ఆస్తిని అంకితం చేశారు. 1965 యుద్ధ సమయంలో దేశ రక్షణ కోసం 425 కిలోల బంగారాన్ని భారత ప్రభుత్వానికి దానం చేశారు. ఆయన వారసత్వాన్ని గౌరవించడం దేశం చేయగల కనీస కర్తవ్యమని తెలిపారు. 

చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు : న్యాయవాది

 రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. చెట్ల నరికివేతలు, పర్యావరణ నష్టం, అక్రమ ఆక్రమణలు జరుగుతున్నాయి. ఇది అభివృద్ధి కాదు, చరిత్ర విధ్వంసం. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించేలా రాష్ట్రాన్ని కోరుతున్నాము, అని న్యాయవాది మొహమ్మద్ వేకార్ హుస్సేన్ అన్నారు. ఇతర వారసులు నవాబ్ మిర్ ఉస్మాన్ అలీ ఖాన్, నవాబ్ మిర్ మిలాద్ అలీ ఖాన్ మాట్లాడుతూ ఈ భూమి కేవలం రియల్ ఎస్టేట్ కాదు, ఇది హైదరాబాద్ , భారత చరిత్రలో ఒక భాగం. మా పితామహులు ప్రజల కోసం ఇచ్చిన సంపదను ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం. మా చరిత్రను రక్షించండి,అని ప్రజలకు, న్యాయవ్యవస్థకు విజ్ఞప్తి చేశారు.