12-10-2025 02:49:38 AM
కరీంనగర్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): కరీంనగర్ బీజేపీలో వర్గపోరు నడుస్తున్నది. ఆ పార్టీ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్, ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. హుజురాబాద్ నియోజకవర్గ పార్టీ నేతల విషయంపై మొదలైన వివాదంపై రోజురోజుకూ ముదురుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహి స్తుంటే, ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరి ఎంపీ గా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య వర్గపోరు నడుస్తుండగా.. తాజాగా జడ్పీటీసీ బీఫారాల పంపిణీ విషయమై పంచాయితీ మరోమారు తారా స్థాయికి చేరింది.
హుజరాబాద్‌లో శుక్రవారం పర్యటించిన ఈటల రాజేందర్.. 25 సంవత్సరాల నుంచి తాను ఇక్కడ లీడర్‌నని, మేమే బీ ఫామ్స్ ఇస్తామని, మేము ఇవ్వకుండా ఎవరిస్తారని విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే ఏ ఒక్క వ్యక్తి ప్రమేయంతో టికెట్లు రావని, గ్రూపులు, వర్గాలుగా కొనసాగుతున్న అనుచరులకు టికెట్లు, బీఫారాలు ఇచ్చే సంప్రదాయం బీజేపీలో లేదని బండి ప్రధాన అనుచరుడు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. వీరి ఆధిపత్య పోరుతో కరీంనగర్ బీజేపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు.
ఇటీవలే హుజురాబాద్ బీజేపీ నాయకులు ఈటలను హైద రాబాద్‌లో కలసిన అనంతరం.. పేర్లు ప్రస్తావించకుండానే బండి, ఈటల డైలాగ్ వార్‌కు దిగడంతో నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. నిజానికి ఈటల రాజకీయమంతా కూడా హుజురాబాద్ నుంచే ముడిపడి ఉంది. కాకపోతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటంతో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. కరీంనగర్ ఎంపీగా మరోసారి గెలిచి కేంద్రమంత్రి అయ్యారు బండి సంజయ్. ఈ సెగ్మెంట్ పరిధిలోకే హుజురాబాద్ నియోజకవర్గం కూడా ఉంటుంది. ఇద్దరు కూడా కీలక నేతలు కావటంతో ఎవరిస్థాయిలో వారికి అనుచరగణం ఉంది. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య విభేదాలు నడుస్తున్నాయి.
గతంలోనూ బండి సంజయ్ హుజురాబాద్‌లో పర్యటించిన సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేవారికే టిక్కెట్లు వస్తాయని చెప్పారు. బీజేపీలో ఏ గ్రూపు లేదని, ఉన్నదల్లా మోదీ గ్రూప్ మాత్రమేనంటూ కామెం ట్స్ చేశారు. కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న నాయకులున్న చోట వారికే టిక్కెట్లు వస్తాయన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ గురిం చి కీలక వ్యాఖ్యలు చేశారు.
హుజురాబాద్‌లో తనకు తక్కువ ఓట్లు రావాలని కొందరు పనిచేశారని చెప్పారు. వాళ్లకు టికెట్లు ఇవ్వమం టారా? అంటూ మాట్లాడారు. పరోక్షంగా ఈటల వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ తెరపైకి వచ్చింది. దీనిపై ఈటల ఘాటుగా స్పందించారు. అధిష్టానం జోక్యం తో సద్దుమణిగింది. తాజాగా ఈటల బీ ఫారాలు ఇచ్చేది నేనే అని ప్రకటించడం దానికి కౌంటర్‌గా బీజేపీ జిల్లా అధ్యక్షుడు స్పందించడంతో మరోమారు వర్గ పోరు బహిర్గతమయింది.