24-01-2026 02:17:10 PM
కందుకూరు సీఐ సీతారాం హెచ్చరిక
రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు
కందుకూరు, జనవరి 24 (విజయక్రాంతి): రోడ్డు నిబంధనలు పాటించడం అంటే నిన్ను నువ్వు కాపాడుకోవడమే కాదు, ఎదుటివారి ప్రాణాలను గౌరవించడమేనని కందుకూరు సీఐ సీతారాం అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా రాచులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ సమక్షంలో గ్రామ యువకులంతా "మద్యం సేవించి వాహనాలను నడపము" అని ఐక్యంగా ప్రమాణం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, అది కేవలం యాక్సిడెంట్ కాదు.. 'కల్పబుల్ హోమిసైడ్' (హత్యకు సమానమైన నేరం) కింద పరిగణించి కఠిన శిక్షలు విధిస్తాం అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికి కోర్టు ద్వారా శిక్ష పడితే, వారిని విధుల నుండి సస్పెండ్ చేసే అవకాశం ఉందన్నారు. అధిక వేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ మరియు ట్రిపుల్ రైడింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తాం. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, ఫోర్ వీలర్ డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరని చెప్పారు. "రోడ్డు భద్రత అనేది ఒకరి బాధ్యత కాదు, అది సమాజ బాధ్యత. నిబంధనలు పాటిస్తేనే సురక్షితంగా ఇంటికి చేరుకుంటామని గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప్పల్ సర్పంచ్ తో పాటు పలువురు యువకులు పాల్గొని రోడ్డు నిబంధనలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.