07-01-2026 12:28:06 AM
నేడు పవిత్ర గంగా జలాన్ని సేకరించనున్న మెస్రం వంశీయులు
ఆదిలాబాద్/ఉట్నూర్, జనవరి 6 (విజయక్రాంతి): దేశంలో రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర సందర్భంగా నిర్వహించే ప్రజా దర్బార్ కు హాజరుకావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు ఆహ్వాన పత్రిక అంద జేశారు. మంగళవారం రాష్ట్ర రాజధానికి వెళ్లిన మెస్రం వంశీయులు డిప్యూటీ సీఎంతో పాటు జిల్లా ఇంచార్జీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికలు అందించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ... నాగోబా జాతర సందర్భంగా ఈనెల 22న నిర్వహించే దర్బార్ కు తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చినట్లు ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద రావు, సర్పంచ్ తుకారాం లతో పాటు మెస్రం వంశీయులు తెలిపారు.
నేడు పవిత్ర గంగా జలం సేకరణ...
మరోవైపు పవిత్ర గంగ నీళ్ల కోసం బయలుదేరిన మెస్రం వంశస్థులు జన్నారం మండలంలోని కలమడుగు వద్ద గల గోదావరి నదికి నేడు చేరుకుంటారు. బుధవారం ఉద యం గంగమ్మ తల్లికి మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి, పవిత్ర గంగా జలాన్ని సేకరించనున్నారు. సేకరించిన గంగా జలంతో కేస్లాపూర్ నాగోబా ఆలయానికి తిరుగు ప్రయాణం కానున్నారు.