07-01-2026 12:29:11 AM
రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి
చేవెళ్ల, జనవరి 6 (విజయక్రాంతి): తెలంగాణ పంచాయతీ ఛాంబర్ ఆధ్వర్యంలో ఈనెల 10న జరిగే జిల్లా సర్పంచుల సంఘం చైతన్య సదస్సును విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆమోదంతో ఇటీవల సర్పంచులుగా ఎన్నికైన గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు రోడ్లు, డ్రైనేజీలు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, కుల సంఘాల భవనాలు, విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి రాష్ట్రానికి అధిక నిధులు వెళ్తున్నాయని, జిల్లా సర్పంచులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి సర్పంచ్లకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లక్ష్యాలు హామీలు నెరవేర్చేందుకు సర్పంచులందరూ పార్టీలకు అతీతంగా ఐకమత్యంగా ఉండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చట్టబద్దంగా,న్యాయబద్ధగా రావాల్సిన నిధులు, విధులు, అధికారాల కోసం సంఘటితంగా పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్టంలో 1995లో సర్పంచుల సంఘం స్థాపించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తన అధ్యక్షతన తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఏర్పాటు చేశామన్నారు. సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో తొలి సర్పంచుల సదస్సు నిర్వహిస్తున్నామని, జిల్లాలోని సర్పంచ్ లు పార్టీలకతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశం తర్వాత జిల్లా సర్పంచుల సంఘం ఎన్నిక ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షులు రెడ్డి శెట్టి మధుసూదన్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, సర్పంచులు గుండన్నగారి ప్రభాకర్ రెడ్ది, గోటూరి రామచంద్రాయ్య, గౌడ్ జుట్టు రామస్వామి, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.