12-01-2026 07:20:57 PM
వేగవంతంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్మాణ పనులు
ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క
నిజామాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ సమాజం ప్రపంచంతో పోటీపడే విధంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క సూచించారు. సోమవారం ఆయన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తదితరులతో కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనుల ప్రగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష జరిపారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, ట్రైనీ కలెక్టర్ కరోలినా చింగ్తియాన్ మావీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక్కో జిల్లా వారీగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్మాణాల స్థితిగతుల గురించి డిప్యూటీ సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏ వేదికలైనా కూడా తెలంగాణ ప్రాంత విద్యార్థులు ప్రతిభా, పాటవాలను ప్రదర్శించి ఉజ్వల భవిష్యత్తు పొందాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళను మంజూరు చేసిందని అన్నారు.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా బోధన, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ఈ విద్యా సంస్థలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీ.సీ అనే విభజన రేఖలను చేరిపివేస్తూ, అన్ని వర్గాల వారు ఒకే చోట నాణ్యతతో కూడిన విద్యా వసతి పొందేలా సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలు అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వీటి నిర్మాణాలు త్వరితగతిన జరిగేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు.
మంజూరీలు తెలుపబడిన చోట అన్ని సెగ్మెంట్లలో తక్షణమే పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని, ఎక్కడైనా భూసేకరణ సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని దిశానిర్దేశం చేశారు. పనులకు శ్రీకారం చుట్టిన జిల్లాలలో క్రమం తప్పకుండా పనుల ప్రగతిని క్షేత్రస్థాయి సందర్శన ద్వారా పర్యవేక్షించాలని అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్మాణాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయని, మైల్ స్టోన్ ప్రకారం పనులు జరుగుతూ, నిర్దేశిత గడువు లోపు పూర్తయ్యేలా మిషన్ మోడ్ లో కృషి చేయాలన్నారు.
బిల్లుల చెల్లింపులలో ఎంతమాత్రం ఇబ్బంది ఉండదని, ప్రతి పక్షం రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చారిత్రాత్మకంగా నిలువనున్న ఈ సమీకృత విద్యా సంస్థల నిర్మాణాలు నాణ్యతతో, నిర్దేశిత ప్రమాణాల మేరకు పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. వివిధ దశలలో నాణ్యతను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా థర్డ్ పార్టీ ఇన్స్ పెక్షన్ టీంలను ఏర్పాటు చేస్తామని అన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు మాట్లాడుతూ... యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్మాణాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున సకాలంలో వీటి నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఎక్కడైనా స్థల సేకరణ విషయమై ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని, వాటిని తక్షణమే పరిష్కరించడం జరుగుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.