నిర్మాణంలోనూ ముడుసార్లు కూలిన బ్రిడ్జి
బీహార్‌లో అవినీతి చిత్రాలు
పాట్నా, ఆగస్టు 17: బీహార్‌లో భవనాలు, వంతెనలు వంటి ప్రభుత్వ మౌలిక వసతులు అలా కట్టడం ఇలా కూలటం సాధారణమే. గత రెండు నెలల్లో పదుల సంఖ్యలో బ్రిడ్జిలు పేకమేడల్లా కూలిపోయాయి. వాటిల్లో కొన్ని కొత్తవి ఉండగా, చాలావరకు ఏండ్లనాడు నిర్మించిన పాతవి ఉన్నాయి. కానీ, తాజాగా కూలిన ఓ వంతెన కథ మాత్రం విచిత్రం. గంగా నదిపై భాగల్పూర్ జిల్లాలో సుల్తాన్‌గంజ్, అగువని ప్రాంతాలను కలుపుతూ 9 ఏండ్లుగా ఓ వంతెన నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం ఇంకా పూర్తికాలేదు.
శనివారం ఈ వంతెలోని పిల్లర్ 9, 10 మధ్య ఉన్న భాగం కూలిపోయి నదిలో కలిసిపోయింది. అయితే, గతంలోనే ఈ వంతెన రెండుసార్లు కూలిపోవటం విశేషం. అంటే నిర్మాణంలో ఉండగానే మూడుసార్లు కూలిపోయిందన్నమాట. ఈ అంశంపై ఖగారియా కలెక్టర్ అమిత్‌కుమార్ పాండే మాట్లాడుతూ.. లోపాల కారణంగా ఈ వంతెన మొత్తాన్ని కూల్చేయాలని పాట్నా హైకోర్టు కాంట్రాక్టర్‌ను ఆదేశించిందని తెలిపారు. ఈ బ్రిడ్జిని ఎస్పీ సింఘ్లా అనే కంపెనీ నిర్మిస్తున్నది. ఇప్పటికే దీని నిర్మాణానికి రూ.1717 కోట్లు ఖర్చు చేశారు. 2014లో దీని నిర్మాణం ప్రారంభమైంది. నిర్మాణ తుది గడువును ఇప్పటికి 8 సార్లు పొడిగించారు.




