calender_icon.png 29 September, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ నేడే!

29-09-2025 01:34:28 AM

ఉదయం 11 గంటలకు ఎస్‌ఈసీ కీలక సమావేశం

ఎన్నికల ప్రకటన విడుదలకు అవకాశం

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): రాష్ర్టంలో స్థానిక సంస్థల ఎన్నిక ల నిర్వహణకు ప్రభుత్వం తీవ్రంగా సన్నాహాలు చేస్తోంది. బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు ఖరారు కావడంతో పాటు, అడ్వకేట్ జనరల్ (ఏజీ)తో సీఎం చర్చల అనంతరం ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది.

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి శనివారం రాత్రి ఉన్నతాధికారులతో చర్చించి, ఆదివారం ఏజీతో సమావేశమై న్యాయ నిపుణుల సూచనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలపై ముందుకెళ్లే సంసిద్ధతను తెలియజేస్తూ, జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు చేసి పంపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే జడ్పీ చైర్‌పర్సన్‌లకు సంబంధించిన రిజర్వేషన్ల గెజిట్‌ను విడుదల చేసింది. జిల్లాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ, ఎంపీపీ అధ్యక్షులు, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ శనివారం నాటికి పూర్తయింది. ఈ రిజర్వేషన్ల జాబితాలను కలెక్టర్లు ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించారు. త్వరలో ప్రభుత్వం ఈ జాబితాలను గెజిట్ రూపంలో ప్రచురించనుంది.

ఈ గెజిట్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించగానే, షెడ్యూల్‌ను ప్రకటించేందుకు ఎస్‌ఈసీ పూర్తిగా సిద్ధంగా ఉంది. హైకోర్టులో పిటిషన్ల దాఖలుకు ముందే, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదినితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, లాఅండ్‌ఆర్డర్ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, పంచాయతీరాజ్, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ఎక్సుజ్ కమిషనర్ తదితరులు సమావేశమయ్యారు.

ఎన్నికలు నిర్వహించాలని, అందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలియజేస్తూ సీఎస్ కంకారెన్స్ లెటర్‌ను అందించారు. దీనిపై స్పందించిన ఎస్‌ఈసీ, రిజర్వేషన్ల గెజిట్ అందిన వెంటనే షెడ్యూల్‌ను ప్రకటిస్తామని, ఎన్నికల నిర్వహణకు తాము అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.

రెండు దశల్లో..

స్థానిక సంస్థల ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నట్టు తెలిసింది. మొదటి దశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు, రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు నిర్వహించనున్నట్టు సమాచారం. కాగా ఈ స్థానిక ఎన్నికల్లో మొత్తం 1,67,03,168 మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో మహిళా ఓటర్ల సంఖ్య (85,36,770) పురుషుల (81,65,894) కంటే అధికం.

రాష్ర్టంలో 12,760 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీ స్థానాలు, 565 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు, జెడ్పీ చైర్‌పర్సన్ స్థానాలను బీసీలకు 13, ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, జనరల్‌కు 8 కేటాయించారు. 31 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో సుమారు 8,000 ఎంపీటీసీ/జడ్పీటీసీ కేంద్రాలు, 21,000 గ్రామ పంచాయతీ కేంద్రాలు సమస్యాత్మక/అతి సున్నితమైనవిగా గుర్తించి, పటిష్ఠ భద్రత, డ్రోన్, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయనున్నారని సమాచారం.