29-09-2025 12:49:09 AM
హైదరాబాద్,సిటీ బ్యూరో సెప్టెంబర్ 28 (విజయక్రాంతి ): మహానగరాన్ని ముంచెత్తిన మూసీ వరద శాంతించడంతో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెఎంసీ) ఇప్పుడు పారిశుద్ధ్య యజ్ఞానికి శ్రీకారం చుట్టిం ది. వరద నీరు వెనక్కి వెళ్లిన ప్రాంతాల్లో పేరుకుపోయిన టన్నుల కొద్దీ బురద, చెత్తాచెదా రం, వ్యర్థాలను తొలగించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
రహదారులకు పూర్వ వైభవం తీసుకురావడం, అదే సమయంలో అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య కవచం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ బృహత్ కార్యక్రమం కొనసాగుతోంది. కమిషనర్ అర్.వి కర్నన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో యంత్రాంగం అహోరాత్రులు శ్రమిస్తుండటంతో, నగరం వేగంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.
ప్రత్యేక యంత్రాల సహాయంతో రేయింబవళ్లు..
వరద తీవ్రతకు అత్యధికంగా ప్రభావితమైన మూసీ నది పరిసర ప్రాంతాలైన ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్, మూసారాంబాగ్‌తో పాటు వాటిని ఆనుకుని ఉన్న బస్తీలు, లోతట్టు కాలనీలపై జీహెఎంసీ ప్రధానంగా దృష్టి సారించింది. వందలాది పారిశుద్ధ్య సిబ్బంది, ప్రత్యేక యంత్రాల సహాయంతో రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో పేరుకుపోయిన బురదను జెట్టింగ్ యంత్రాలతో శుభ్రం చేసి, స్కిడ్ స్టీర్ లోడర్ల ద్వారా తరలిస్తున్నారు.
దీంతో రహదారులు మళ్లీ వాహన రాకపోకలకు అనువుగా మారుతున్నాయి. ఇంకా నిలిచిపోయిన వరద నీటిని భారీ మోటార్ పంపుసెట్ల ద్వారా బయటకు పంపిస్తున్నారు. వరద కారణంగా పూడికతో నిండిన నాలాలు, డ్రెయినేజీ లైన్లలో డీసిల్టింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అదే విధంగా ఇళ్లు, దుకాణాల నుంచి వచ్చిన వరద వ్యర్థాలను, చెత్తను ప్రత్యేక వాహనాల్లో డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు.
50కి పైగా బస్తీలు, కాలనీల్లో..
‘వరద తగ్గినప్పటికీ, మా అసలైన పని ఇప్పుడే మొదలైంది. ప్రతి పౌరుడి ఆరోగ్యం, భద్రత మా బాధ్యత. నగరాన్ని వీలైనంత వేగంగా సాధారణ స్థితికి తీసుకురావడమే మా లక్ష్యం’ అని కమిషనర్ అర్.వి కర్నన్ స్పష్టం చేశారు. దాదాపు 50కి పైగా బస్తీలు, కాలనీలను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రక్షాళన కొనసాగుతోంది. వరద అనంతర పరిస్థితు ల్లో పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు అంటువ్యాధులు. ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా వంటి వ్యాధు లు ప్రబలకుండా జీహెఎంసీ పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది.
నీరు నిలిచిన ప్రాం తాలు, మురుగు గుంటలు, చెత్తాచెదారం ఉన్న ప్రదేశాల్లో దోమల లార్వా వృద్ధి చెందకుండా యాంటీ-లార్వా రసాయనాలను స్ప్రే చేస్తున్నారు. ప్రతి వీధిలో, ఇంటి పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తూ క్రిమిసంహారక చర్యలు చేపట్టారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా జీహెఎంసీ తక్షణమే పరిష్కరిస్తోంది.
మీ వీధిలో చెత్త పేరుకుపోయిందా? డ్రెయినేజీ సమస్య ఉందా? వెంటనే మా హెల్ప్‌లైన్ 040-21111111కు కాల్ చేయండి లేదా మైజీహెఎంసీ యాప్‌లో ఫిర్యాదు చేయండి అంటూ సోషల్ మీడియా వేదికగానూ ప్రచారం చేస్తోంది.
ప్రజలు సహకరించాలి
ఈ క్లీనప్ డ్రైవ్ విజయవంతం కావడానికి ప్రజల సహకారం అత్యంత కీలకమని జీహెఎంసీ పేర్కొంది. చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని, పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని కోరింది. హైదరాబాద్ మళ్లీ తన పూర్వ పు పరిశుభ్రతను సంతరించుకోవడం ఖాయమని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా, నగ రంలోని డ్రెయినేజీ వ్యవస్థను మరింత ఆధునీకరించే ప్రణాళికలకు కూడా జీహెఎంసీ రూపకల్పన చేస్తోంది.