calender_icon.png 29 September, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహానగరం పల్లెబాట

29-09-2025 12:43:25 AM

  1. బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు పోటెత్తిన జనం  
  2. మూసీ వరద తగ్గుముఖం.. ఎంజీబీఎస్‌కు ప్రయాణికులు 

హైదరాబాద్,సిటీ బ్యూరో సెప్టెంబర్ 28 (విజయక్రాంతి ): మహానగరం పల్లెబాట పట్టింది. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా వరుస సెలవులు రావడంతో నగరవాసులు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి నగరంలోని ప్రధాన బస్ టెర్మినళ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో జనసంద్రంగా మారాయి. ముఖ్యంగా, ఇటీవలి మూసీ వరదల కారణంగా మూతపడిన మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) అదివారం పునఃప్రారంభం కావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా పోటెత్తారు.

రద్దీకి అనుగుణంగా బస్సులు..

మూసీ నదికి వరదలు తగ్గుముఖం పట్టడంతో, అధికారులు యుద్ధప్రాతిపదికన బురద, చెత్తను తొలగించి ఎంజీబీఎస్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు. అయితే, పండుగ సెలవులు తోడవడంతో బస్టాండ్ తెరిచిన కొద్ది గంటల్లోనే కిక్కిరిసిపోయింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ లోని వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు వేలాదిగా తరలిరావడంతో ప్లాట్‌ఫారాలపై అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది.

బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చిం ది. వచ్చిన బస్సులు వచ్చినట్టే నిమిషాల వ్యవధిలో నిండిపోయాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో చాలామంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్ (జేబీఎస్)లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ ప్రాంగణం కిటకిటలాడింది.