14-10-2025 01:12:48 AM
మంత్రి శ్రీధర్‌బాబు
మంథని, అక్టోబర్ 13(విజయ క్రాంతి): సరస్వతి నిలయంగా మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. నూత న ఏటీసీ నిర్మాణానికి రూ.45 కోట్లు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి రూ.10 కోట్లు చేశామన్నారు.
సోమవారం మంథని క్యాం పు కార్యాలయంలో రామగిరి కమాన్ పూర్, మంథని, ముత్తారం మండలాలకు సంబంధించి 87 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ ఎఫ్ చెక్కులు, 38 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించే దిశగా ఐటీఐ కేంద్రాలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా అప్‌గ్రే డ్ చేయడం జరిగిందన్నారు.
ఏటీసీ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఇటీవలే కాటారంలో రూ.35 కోట్లతో నిర్మించిన ఏటీసీని ప్రారంభించామని, రూ.45 కోట్లు ఖర్చు చేసి మంథని పట్టణంలో నూతనంగా ఏటీసీని నిర్మిస్తామని వివరించారు. మంథని ప్రజలకు ఉపయోగపడే విధంగా పట్టణంలో వివిధ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేశామని చెప్పారు.
మంథని పట్టణంలో రూ.30 కోట్లతో అంతర్గత సీసీరోడ్లు వేసామని, అంబేడ్కర్ విజ్ఞాన్ భవన్ నిర్మాణానికి కోటి, మున్నూరు కాపు భవనానికి రూ.60 లక్షలు, మధున పోచమ్మ ఆలయ అభివృద్ధికి రూ.25 లక్షలు, వినాయక మండపానికి రూ.10 లక్షలు, మహాల క్ష్మి దేవాలయానికి రూ.10 లక్షలు, చిన్నయ్య-పెద్దయ్య ఆలయానికి రూ.10 లక్షలు, మహి ళా భవనానికి రూ.50 లక్షలు కేటాయించామని తెలిపారు.
రిటైర్డ్ ఉద్యోగులు రీక్రియేష న్ అయ్యేందుకు రూ.50 లక్షల మంజూరు చేశామన్నారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి అవసరమైన భూమి ఎంపిక చేసి త్వరగా టెండర్లు పిలవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఏటీసీ కేంద్రంలో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతినెలా రూ.2000 స్కాలర్షిప్ అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ. సురేష్, తహసీల్దార్ కుమారస్వామి, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కుడుదుల వెంకన్న, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రామాదేవి, మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, రాష్ట్ర నాయకులు శశి భూషణ్ కాచే, కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.