15-10-2025 10:31:43 AM
పాట్నా: జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) కీలక నిర్ణయం తీసుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, కానీ పార్టీ కోసం ఎన్నికల్లో పని చేస్తానని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. బీహార్‌లో అధికార ఎన్డీఏ ఓటమిని అంచనా వేయడానికి ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణం సీట్లు, అభ్యర్థులను ఖరారు చేయడంలో అసమర్థతను ఉదహరించారు. 243 స్థానాలున్న అసెంబ్లీలో జెడి(యు) 25 సీట్లు కూడా గెలవడానికి ఇబ్బంది పడుతుందని ఇటీవల పిటిఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కిషోర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని పార్టీకి పరిస్థితి మరింత దిగజారిపోయిందని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీయే ఓటమి తప్పదన్న ప్రశాంత్ కిషోర్ నీతిష్ కుమార్(Nitish Kumar) మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని జోస్యం చెప్పారు. అటు ఇండియా కూటమి పరిస్థితి కూడా అంతగా బాలేదన్న ఆయన కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బీహార్ లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నెల రోజుల్లోనే 100 మంది అవినీతి రాజకీయ నేతలు, అధికారులపై చర్యలు తీసుకున్నామని హెచ్చరించారు. బీహార్ రాష్ట్రంలో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) మంగళవారం 71 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది.