calender_icon.png 14 October, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక విద్యకు తూట్లు!

14-10-2025 01:11:51 AM

  1. ఎస్జీటీ టీచర్ల పోస్టుల్లో కోత
  2. పీఈటీ, హెచ్‌ఎం పోస్టుల మంజూరు కోసం 2 వేల ఎస్జీటీ పోస్టులకు కత్తెర
  3. ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు 
  4. ప్రాథమిక విద్యపై తీవ్ర ప్రభావం 
  5. తరగతికి ఒక టీచర్‌ను కేటాయించాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు

హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): అధికారులు తీసుకునే నిర్ణయాలతో ప్రాథమిక విద్యకు తూట్లు పడే ప్రమాదం ఉంది. విద్యార్థి జీవితానికి ప్రాథమిక విద్య ఎంతో కీలకం. అలాంటి ప్రాథమిక విద్యాబోధనలో నాణ్యత, వసతులు ఉండాల్సిందిపో యి కత్తెర పెడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. టీచర్ల కొరత ఉన్న ప్రాథమిక పాఠ శాలలకు అదనపు టీచర్లను కేటాయించకుండా ఉన్న టీచర్ల సంఖ్యకు కోత పెట్టే చర్యలను విద్యాశాఖ చేపడుతోంది.

ప్రైమరీ స్కూళ్లలో టీచర్లు ఎ క్కువగా ఉన్నారని చూపిస్తూ సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల్లో కోత పెట్టేందుకు సమాయత్తం అవుతోంది. అంతేకాకుం డా 260 ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేసేందు కు సైతం ఎస్జీటీ పోస్టులను తగ్గించి ఆ స్థానా ల్లో ఎస్జీటీ పోస్టులను ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. 

రెండువేలకుపైగా పోస్టులు రద్దు!

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపైన ఎక్కువగా దృష్టి సారిస్తోంది. విద్యార్థులను చిన్నప్పటి నుంచే క్రీడల్లో శిక్షణ ఇస్తే రాణిస్తారని భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రతి హైస్కూల్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)లను నియ మించాలనుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు సైతం ఇచ్చారు. ఈ క్రమంలోనే పీఈటీలను నియమించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

రాష్ట్రంలో మొత్తం 24,227 ప్రభుత్వ స్కూ ళ్లుంటే, అందులో 16,448 ప్రైమరీ స్కూళ్లు, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 3,102 ఉండగా, 4,677 హైస్కూళ్లు ఉన్నాయి. వీటిలో 1,04,605 మంది టీచర్లు పనిచేస్తున్నారు. పోస్టులను ప్రామాణికంగా తీసుకోకుండా విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లను కేటాయిస్తున్నారు. విద్యార్థులుంటేనే టీచర్లను కేటా యిస్తున్నారు. రాష్ట్రంలో 7,364 బడుల్లో టీచర్ల కొరత ఉండగా, మరోవైపు 21,140 మంది మిగులు టీచర్లు ఉన్నట్లు చెపుతున్నారు.

రాష్ట్రంలో 16,448 ప్రైమరీ స్కూళ్లుం టే 40,571 మంది ఎస్జీటీ టీచర్లున్నారు. వి ద్యార్థుల సంఖ్య ఆధారంగా 11,232 మంది మిగులు టీచర్లు ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. ఇక 4,677 ఉన్నత పాఠశాలలుం టే మొత్తం 51,211 మంది టీచర్లున్నారు. వీటిలో 2,864 మంది పీఈటీ/పీఈడీలు పనిచేస్తున్నారు. మరో 1,803 చోట్ల పీఈటీలు లేరు.

అన్ని పాఠశాలల్లో పీఈటీలను నియమించాలని సీఎం ఇటీవల అధికారులకు ఆదేశించిన క్రమంలో ప్రాథమిక పాఠశాలల్లో ఎస్‌జీటీ పోస్టులను తగ్గించి ఆ మేరకు కొత్తగా 1,803 పీఈటీ పోస్టులను మంజూరు చేయనున్నారు. దీంతోపాటు 260 హెచ్‌ఎం పోస్టుల కోసం కూడా ఎస్జీటీ పోస్టులను తగ్గించనున్నారు. మొత్తంగా 2,063 ఎస్జీటీ పోస్టుల్లో కోత పడనుంది. 

ఉన్నవాళ్లపైనే భారం

ఒకవైపు టీచర్ల కొరత ఎక్కడా లేదని అధికారులు అంటుంటే,  మరోవైపు తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని ఇవ్వడంలేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. పైగా ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రీప్రైమరీ తరగతులనూ ప్రారంభించారు. వీరికి రెగ్యులర్ టీచర్లను నియమించాల్సి ఉంది. అంతేకాకుండా ప్రాథమిక పాఠశాలల్లో బోధించే ఒకరు లేదా ఇద్దరు ఎస్జీటీ టీచర్లే మొత్తం 18 సబ్జెక్టులను బోధిస్తున్న పరిస్థితి ఉంది.

ఒకటి, రెండు తరగతుల్లో మూడేసి చొప్పున సబ్జెక్టులు, మూడు, నాలుగు, ఐదో తరగతుల్లో నాలుగేసి సబ్జెక్టులుంటాయి. కొన్ని చోట్ల ఒక్క టీచరే ఈ సబ్జెక్టులన్నింటినీ బోధిస్తుంటే, మరికొన్ని చోట్ల ఇద్దరు ఉపాధ్యాయులు చేరో 9 సబ్జెక్టులను బోధిస్తున్నారు.

అలాకాకుండా ఒక్కో తరగతికి ఒక ఎస్జీటీ టీచర్‌ను కేటాయించాలని ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇది అమలు కావడం లేదు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందని పరిస్థితి. విద్యార్థులు చేరడంలేదని సాకుగా చూపిస్తూ టీచర్ పోస్టుల్లో కోత విధించడాన్ని ఉపాధ్యాయులు తప్పుబడుతున్నారు.

పోస్టులను రద్దు చేయడం సరైంది కాదు

క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచి పరిణామమే. కానీ పీఈటీ పోస్టులను మంజూరు చేయడం కోసం ఎస్జీటీ పోస్టులను రద్దు చేయడం సరైంది కాదు. ఇలా చేస్తే ప్రాథమిక విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. విద్యార్థులు ఎక్కవగా ఉన్న చోట టీచర్లను అదనంగా కేటాయించాలి. ఇకనైనా ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని సవరించి ప్రాథమిక పాఠశాలల్లో కూడా కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక హెడ్మాస్టర్‌ను ఇవ్వాలి. ఒకరు లేదా ఇద్దరు టీచర్లతో 18 సబ్జెక్టులు బోధిస్తూ నాణ్యమైన విద్య అందించడం సాధ్యం కాదు. 

 నవాత్ సురేష్, ప్రధాన కార్యదర్శి,

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం