15-10-2025 09:36:07 AM
బుగ్గ అర్చకుడి పై బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో(Sri Bugga Rajeshwara Swamy Temple) ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తున్న శ్రీరాంబట్ల వేణుగోపాల శాస్త్రి ఒక మహిళ భక్తురాలిపై అత్యాచారయత్నానికి ఒడిగట్టిన ఉదంతం బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈనెల 6న కుటుంబ సభ్యులతో కలిసి మహిళ బుగ్గ శివాలయానికి దర్శనం కోసం వచ్చింది. తనకు సంతానం కలగడం లేదని, ఇందుకోసం శివాలయంలో రాజరాజేశ్వరునికి మొక్కు చెల్లించి పూజలు నిర్వహించేందుకు వచ్చినట్లు ప్రధాన అర్చకులైన వేణుగోపాల శాస్త్రికి తెలిపింది.
దీంతో తాను ఇంటికి వచ్చి పూజ చేస్తానని ఆ మహిళను నమ్మించారు. మరుసటి రోజు ఉదయమే అర్చకులు శ్రీరాంబట్ల వేణుగోపాల శాస్త్రి సదరు మహిళ ఇంటికి వెళ్లి పూజలు నిర్వహించేందుకు వచ్చినట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న ఆమె తల్లిని బయటకు పంపించారు. మహిళను ఇంట్లోకి తీసుకెళ్లి తలుపు గడియ పెట్టి ఒళ్లంతా పసరు రాయాలని ఒత్తిడి చేశారు. పసరు తాను రాసుకుంటారని మహిళ చెప్పినప్పటికీ వినకుండా తన చేతులతోనే ఒళ్లంతా రాయాలని అప్పుడే నీకు పిల్లలు పుడతారని మహిళను బెదిరించారు.
మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. సదరు మహిళ అర్చకుడుని నెట్టేసి తలుపు గడియ తీసుకొని బయటకు వచ్చి తన తల్లికి జరిగిన విషయం చెప్పింది. విషయం బయటకు పొక్కడంతో అర్చకులు శ్రీరాంభట్ల వేణుగోపాల శాస్త్రి అక్కడి నుండి వెళ్లిపోయారు. వారం రోజులుగా మానసిక వేదన గురైన బాధితురాలు తన కుటుంబ సభ్యులకు, స్నేహితురాళ్లకు జరిగిన విషయం తెలిపింది. బాధితురాలి కుటుంబ సభ్యులు అర్చకులు శ్రీరాంబట్ల వేణుగోపాల శాస్త్రి పై కఠిన చర్యలు తీసుకోవాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారికి ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో కూడా అర్చకులు శ్రీరాంభట్ల వేణుగోపాల శాస్త్రి మహిళలను వేధించినట్లు పలు ఆరోపణలు ఎదుర్కొని సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ విషయమే ఈవో బాపిరెడ్డిని సంప్రదించగా అర్చకులు వేణుగోపాల శాస్త్రి పై బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం వాస్తవమేనని తెలిపారు.