16-09-2025 07:52:20 PM
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ పార్లమెంటు సభ్యులు , కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ చొరవ , కృషితో పార్లమెంటు పరిధిలోని అనేక ప్రాంతాల్లో రహదారుల ముఖచిత్రం మారుతుందని బిజెపి పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తెలిపారు. మంగళవారం కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో ప్రవీణ్ రావు మాట్లాడుతూ కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి ( సి ఆర్ ఐ ఎఫ్) నిధుల కింద దాదాపు 500 కోట్లతో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రహదారుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ మొత్తం రూ.868 కోట్ల నిధులు మంజూరు అయితే , అందులో రూ.150 కోట్లు ఒక్క కరీంనగర్ పార్లమెంటు నియోజక వర్గానికి కేటాయించడం జరిగిందని తెలిపారు.
ప్రధానంగా ఒక వరుసల రహదారిని, రెండు వరుసలా రహదారిగా మార్చడం , నూతన రోడ్ల నిర్మాణం, వంతెనల నిర్మాణం పనులతో అనేక ప్రాంతాల్లో ప్రజల, ప్రయాణికుల రవాణా వ్యవస్థను మేరుగుపరచాలనే ఉద్దేశంతో బండి సంజయ్ కుమార్ తపన, లక్ష్యంతోపనిచేస్తున్నారని, రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రహదారుల అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రధానంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం సీఆర్ఐఎఫ్ నిధులతో చేపట్టాల్సిన రహదారుల అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ప్రపోజల్సును అంగీకరించలేదని తెలిపారు. ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంటులో జరుగుతున్న అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారని, దీంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు.
కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి తగిన సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ కి పార్లమెంటు ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. అలాగే ప్రస్తుత సిఆర్ఐఎఫ్ నిధుల తో మానకొండూర్, చొప్పదండి , వేములవాడ నియోజకవర్గాల్లో జరగనున్న అభివృద్ధి పనుల కోసం తమవంతుగా సహకరించిన ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు బిజెపి పక్షాన థాంక్స్ చెప్తున్నట్లు తెలిపారు.