calender_icon.png 16 September, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ విద్యను నీరుగారుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

16-09-2025 07:54:06 PM

అందరికీ విద్య కొరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలి

బహిరంగ సభలో వక్తనున్న అప్పారావు పి.డి.ఎస్.యూ మాజీ‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు.

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యకు పట్టంకడుతూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని పిడిఎస్యూ నేతలు ధ్వజమెత్తారు. కొత్తగూడెం పట్టణంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యూ) జిల్లా 3వ మహాసభ సందర్భంగా మంగళవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి ఉర్దూఘర్ ఫంక్షన్ హాల్ వరకు విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించి, బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు నున్న అప్పారావు పాల్గొని మాట్లాడుతూ ఐదు దశాబ్దాలను పూర్తి చేసుకున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం‌ (పి.డి.ఎస్.యూ) ఉమ్మడి తెలుగు నేలపై చరిత్రలో నిలిచిపోయే విధంగా విద్యార్థుల పక్షాన నిలుస్తూ అసామాన్య త్యాగాలతో రాజీలేని పోరాటాలను నిర్వహించిందని, కా జార్జిరెడ్డి మొదలు ఎందరో విద్యార్థులు తమ నిండు ప్రాణాలు తృణప్రాయం అర్పించి విద్యార్థి ఉద్యమానికి ఎంతో ఊతమిచ్చారని, విద్యార్థి అమరవీరుల ఆశయ సాధనకై విద్యార్థులు మరింత ఉధృతమైన ఉద్యమాలను నిర్వహించాలన్నారు. 

అందరికీ ఉచితంగా, సమాన విద్యను అందించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను వ్యాపార సరుకుగా మార్చి కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తున్నాయనీ, పేద విద్యార్థికి విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు. విద్యారంగాన్ని తమకు అనుగుణంగా మలుచుకుంటూ బూర్జువా పాలకవర్గాలు సమాజంలో విద్య  అసలు లక్ష్యాన్ని నుండి తప్పిస్తుయన్నారు. దేశ అభివృద్ధి పట్ల, ప్రజల పరిస్థితుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేని పాలకులు సామ్రాజ్యవాద విష సంస్కృతిని పెంచి పోషిస్తూ విద్యార్థులను, యువతను పెడదోరనలు పట్టేలా చేస్తున్నారనీ మండిపడ్డారు. విద్యార్థులను ప్రశ్నించే తత్వం నుండి తప్పిస్తూ నేటి విద్యార్థి శక్తిని నిర్వీర్యం చేస్తురన్నారు. 

ఇలాంటి తరుణంలో ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలు మరింత ముందుకు రావాలని నూతన ప్రజాస్వామిక విలువల కోసం, శాస్త్రీయ విద్యా సాధనకై, విద్యార్థి అమరవీరుల ఆశయ సాధనకై విద్యార్థి లోకం మరింత ఉధృతంగా ఉద్యమాలను నిర్వహించాలని వారు విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. ఈ సభలో పి.డి.ఎస్.యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సాంబ, సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కొమరం సత్యనారాయణ, సహాయ కార్యదర్శి కందగట్ల సురేందర్, ఏ.ఐ.కే.ఎం.ఎస్ జిల్లా అధ్యక్షుడు ఉప్పరబోయిన రామ్మూర్తి, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు వీరమల్ల ఉమ, మల్లూరి సుగుణ, పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జే గణేష్ లు ప్రసంగించారు. పి.డి.ఎస్.యూ జిల్లా నాయకులు డి అరుణ్, పల్లవి, సందీప్, సంతోష్, రాజేష్, జీవన్, మౌనిక, భరత్, సాయి‌ తదితరులు పాల్గొన్నారు.