16-09-2025 07:49:16 PM
గద్వాల: విద్యార్థులు, యువత భవిష్యత్తు కోసం డిజిటల్ లైబ్రరీ, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం తాత్కాలిక ఏర్పాట్లు వేగంగా పూర్తి చేసి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయ భవనంలో తాత్కాలిక డిజిటల్ లైబ్రరీ, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటుకు భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా బీఎస్ఎన్ఎల్ కార్యాలయ భవనంలో డిజిటల్ లైబ్రరీ,గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన పనులను చేపట్టాలన్నారు. భవన వసతులు పరిశీలించి, అవసరమైన సౌకర్యాలను సమకూర్చాలని సూచించారు.
అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేసి, కావలసిన పరికరాలు, సామగ్రి,మౌలిక వసతులను సమకూర్చాలని ఆదేశించారు. విద్యార్థులకు చదువుకు అనుకూలమైన వాతావరణం కల్పించే విధంగా ఏర్పాట్లను చేపట్టాలన్నారు.ఈ పనులన్నింటిని పర్యవేక్షించి, కేంద్రాన్ని త్వరితగతిన ప్రారంభించేందుకు ఎల్‌డిఎం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుతో విద్యార్థులు పుస్తకాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.ఆన్‌లైన్ తరగతులు, పోటీ పరీక్షలకు అవసరమైన సదుపాయాలతో పాటు, నూతన కోర్సులు వంటి అంశాల్లో వారికి ఈ కేంద్రం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ద్వారా యువత ఉపాధి అవకాశాలకు అవసరమైన శిక్షణలను పొందగలరని అన్నారు. విద్య, జ్ఞానం, ఉపాధి, వ్యక్తిత్వ వికాసం – అన్నింటినీ ఒకే వేదికపై అందించే ఈ కేంద్రం విద్యార్థుల భవిష్యత్తుకు దోహదం చేస్తుందని ఆయన అన్నారు.