31-08-2025 12:21:41 AM
ఖైరతాబాద్; ఆగస్టు 30 (విజయక్రాంతి) : ఖైరతాబాద్ మహా గణేష్ ని దర్శించుకునేందుకు దేశంలోనే వివిధ రాష్ట్రాల నుంచి శనివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యు లు పోలీసుల సహాయ సహకారాలతో ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేశారు.
దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తుల కోసం, విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారుల కోసం ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ మున్సిపల్ గ్రామంలో భోజన సదుపాయాలను కల్పించింది.ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఆకతాయిల పని చెప్పేందుకు షి టీమ్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
గణేశుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
గణేశుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఖైరతాబాద్ మహా గణేష్ ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆమెకు సాగర స్వా గతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు .
మహాగణపతిని దర్శించుకున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ దంపతులు
ఖైరతాబాద్ మహాగణపతిని శనివారం జిహెచ్‌ఎంసి కమిషనర్‌ఆర్ వి కర్ణన్ దంపతులు దర్శించుకున్నారు. కర్ణన్ దంపతులు ఐ అండ్ పిఆర్ ప్రత్యేక కమిషనర్ సిహెచ్ ప్రియాంకలు పూజలు నిర్వహించారు.అనంతరం ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి వద్ద బారీకే డ్లు, క్యూలైన్‌లు, భద్రతా ఏర్పాట్లను కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ పరిశీలించారు.రాష్ట్ర నలు మూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు మహాగణపతిని దర్శించుకునేందుకు వస్తున్నందున దర్శనం సజావుగా, వేగంగా జరిగేలా చూడాలని నిర్వాహకులను, అధికారులకు సూచించారు.