24-05-2025 12:40:09 AM
- 9వ రోజు 3 లక్షల మంది పుష్కర స్నానం
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పుణ్యస్నానం
- కాళేశ్వరంలో వర్షంతో ఇబ్బందులు
- గంటలపాటు ట్రాఫిక్‌లో ఇరుక్కున్న భక్తులు
- భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో అధికారుల విఫలం
మంథని, మే 23 (విజయక్రాంతి)/మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన సరస్వతీ నది పుష్కరాలకు శుక్రవారం 9వ రోజున 3 లక్షలకు పైగా భక్తులు వచ్చి, పుణ్యస్నానం ఆచరించారు. దీంతో సరస్వతీ పుష్కర ఘాట్ కళకళలాడింది.
కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో భక్తులు రద్దీ ఎక్కువగా కనిపించింది. హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి, కాళేశ్వర ఆయలంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పాటు శుక్రవారం కురిసిన వానకు కాళేశ్వరంలో పార్కింగ్ స్థలాలు తడిసి ముద్దవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అధికారులు కాళేశ్వరం వచ్చే వాహనాలను వన్ వే ట్రాఫిక్‌గా మార్చడంతో పూసుకుపల్లి నుంచి సరస్వతీ ఘాట్ వరకు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌లోనే ఐదు నుంచి ఆరు గంటలు చిక్కుకున్నారు. దీంతో బస్సులు, సొంత వాహనాలు దిగి భక్తులు నడుచుకుంటూ ఘాట్ వరకు వెళ్లారు. రద్దీ ఏర్పడిన ప్రాంతమంతా అటవీ ప్రాంతం అవడంతో నీళ్లు కూడా లభించలేదని భక్తులు ఆరోపించారు.
పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో అధికారులు విఫలం చెందారని భక్తులు మండిపడ్డారు. ఎస్పీ, కలెక్టర్ ఇద్దరు ట్రాఫిక్‌లో చిక్కుకున్న భక్తులకు ఇబ్బందుల రాకుండా చర్యలు చేపట్టారు. కాగా సండ్రుపల్లి మూల వద్ద గ్రామపంచాయతీ పేరుతో ప్రైవేట్ వాహనాలకు వంద రూపాయల చొప్పున వసూలు చేశారు. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ డీపీవో ఆదేశాలు ఇచ్చి చిట్టి వసూళ్లు నిలిపి వేయాలని ఆదేశించారు.
సమాచార సేకరణకు వాకీ టాకీలు
సరస్వతీ పుష్కరాల్లో సత్వర సమాచార సేకరణకు వాకీ టాకీలు వినియోగిస్తున్నట్టు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. పుష్కరాల సందర్భంగా లక్షలాది భక్తులు త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు చేసేందుకు తరలివస్తున్నారు. భద్రత, రవాణా, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో సమయానికి స్పందన ఇచ్చేందుకు, విపత్తులను వెంటనే అధిగమించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సాంకేతిక సేవలను వినియోగిస్తున్నారు. భక్తుల రాక పెరిగిన నేపథ్యంలో పూసుపల్లిలో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటుచేశారు.