calender_icon.png 25 January, 2026 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా జాతరలో పిల్లలకు క్యూఆర్ రక్షణ

25-01-2026 12:07:37 AM

తప్పిపోయే వారి ఆచూకీ కోసం స్మార్ట్ ప్లాన్

చిన్నారులు, దివ్యాంగుల కోసం రిస్ట్ బ్యాండ్లు స్కాన్ చేస్తే తల్లిదండ్రుల వివరాలు 

సీటీఎంఎస్ విధానాన్ని ప్రారంభించిన డీజీపీ శివధర్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 24 (విజయక్రాంతి): ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతరలో భక్తుల రద్దీ సాధారణంగా ఉండదు. లక్షలాది మం ది పోటెత్తే ఈ జనసంద్రంలో పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు తప్పిపోవడం సర్వసాధారణం. వారిని వెతికి పట్టుకోవడం పోలీసు లకు, కుటుంబ సభ్యులకు పెద్ద సవాలు. అయితే, ఈసారి ఆ సమస్యకు చెక్ పెడుతూ తెలంగాణ పోలీసులు అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు.

మేడారంలో పిల్లలు తప్పిపోతే క్షణాల్లో వారి ఆచూకీని గుర్తించేందుకు చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ను అమల్లోకి తెచ్చారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని శనివారం డీజీపీ బి. శివధర్ రెడ్డి తన కార్యాలయంలో ప్రారంభించారు.వొడాఫోన్ ఐడి యా లిమిటెడ్ సహకారంతో రూపొందించిన ఈ విధానంలో పిల్లలు, దివ్యాంగుల చేతికి ఒక ప్రత్యేకమైన రిస్ట్ బ్యాండ్ కడతారు.

దీనిపై ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. జాతరకు వెళ్లే ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో పిల్లల పేరు, తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు నమోదు చేసి ఈ బ్యాండ్ కడతారు. జాతరలో ఎవరైనా తప్పిపోతే.. అక్కడ ఉండే వాలంటీర్లు లేదా పోలీసులు ఆ బ్యాండ్ పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తారు. వెంటనే వారి తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నెంబర్ స్క్రీన్ పై కనిపిస్తుంది. తద్వారా వెంటనే వారికి సమాచారం అం దించి, పిల్లలను సురక్షితంగా అప్పగించవచ్చు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఏపీల నుంచి కూడా భక్తులు భారీగా వస్తారు. రద్దీలో పిల్లల భద్రత మాకు అత్యంత ప్రాధాన్యం.

గత అనుభవాల దష్ట్యా ఎస్‌ఐబి ఐజీపీ బి. సుమతి కృషితో ఈ టెక్నాలజీని తీసుకువచ్చాం. మహిళా భద్రత విభాగం డీజీపీ చారుసిన్హా పర్యవేక్షణలో ఇది అమలవుతుంది. భవిష్యత్తులో కుంభమేళా వంటి వా టికి కూడా ఇది దిక్సూచిగా మారుతుంది అని పేర్కొన్నారు. భక్తులు తమ పిల్లల వివరాలు నమోదు చేసుకుని బ్యాండ్లు తీసు కోవాలని పోలీసులు సూచించారు. ఎవరైనా బ్యాండ్ ఉన్న పిల్లలు ఒంటరిగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీజీపీ కోరారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీపీలు మహేష్ ఎం. భగవత్, చారుసిన్హా, డి.ఎస్. చౌహాన్, ఐజీపీలు చంద్రశేఖర్ రెడ్డి, బి.సుమతి తదితరులు పాల్గొన్నారు.