19-11-2024 12:00:00 AM
విజయక్రాంతి, ఖేల్ విభాగం : పైరేట్ ఈ మాటకు సముద్ర దొంగ అనే అర్థం. ఈ పదం పట్నా పైరేట్స్ యంగ్ రెయిడర్ దేవాంక్ దలాల్‌కు సరిగ్గా సరిపోతుందేమో. పైరేట్స్ షిప్పులను టార్గెట్ చేసి లూటీలు చేస్తే దేవాంక్ ప్రత్యర్థి జట్టును టార్గెట్ చేసి పాయింట్లు లూటీ చేస్తున్నాడు. సీజన్ 11లో పట్నా పైరేట్స్ దుమ్ములేపుతోంది.
గత వైభవాన్ని గుర్తుకు తెస్తూ యువ రైడర్ దేవాంక్ రెచ్చిపోతున్నాడు. దేవాంక్ దెబ్బకు పట్నా పైరేట్స్ లీగ్‌లో ఇప్పటికే ఆరు విజయాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. పట్నా స్టార్ రైడర్ దేవాంక్ ఇప్పటికే 115 రెయిడ్ పాయింట్లు సాధించి సత్తా చాటాడు.
ఆర్మీకి వెళ్దామని..
హర్యానాలో 22 ఏండ్ల దేవాంక్ కబడ్డీ ప్లేయర్ కావాలని ఏనాడు కలలు కనలేదు. ఆర్మీకి ఎంపికై దేశ సేవ చేయాలని భావించిన దేవాంక్ అనుకోకుండా కబడ్డీ ప్లేయర్ అయ్యాడట. దేవాంక్ సక్సెస్‌ను చూసి అతడి ఇద్దరు సోదరులు కూడా ఇప్పుడు ఇదే బాటలో నడుస్తున్నారు. దేవాంక్ పీకేఎల్ తొమ్మిదో ఎడిషన్లో జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున ఆడాడు. ఆ సీజన్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ కప్పును ఎగరేసుకుపోయింది.
అనంతరం దేవాంక్ పట్నాతో జతకట్టి అదరగొడుతున్నాడు. గత కొద్ది సీజన్లుగా పట్నా సరిగా రాణించకపోయినా పీకేఎల్ హిస్టరీలో ఏ జట్టు కూడా బీట్ చేయలేని అసాధారణ రికార్డును తన పేరిట లిఖించుకుంది. వరుసగా హ్యాట్రిక్ టైటిల్స్ సాధించిన జట్టుగా పట్నా పైరేట్స్ రికార్డులకెక్కింది. అయితే పట్నా పైరేట్స్ ఈ సీజన్‌లోనూ పడుతూ లేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
పీకేఎల్ 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఆరో విజయాన్ని నమోదు చేసుకుంది. నోయిడా వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 49-27తో హర్యానా స్టీలర్స్‌ను చిత్తు చేసింది. టైటాన్స్ తరఫున ఆశిష్ నర్వాల్ 11 పాయింట్లు, కెప్టెన్ విజయ్ 8 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో యు ముంబా 38-37 తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. ఈ విజయంతో యు ముంబా పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.