22-01-2026 03:13:24 AM
హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి) : పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వేదికగా జరిగే వరల్డ్ ఎకనా మిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్న తెలంగాణ ప్రభు త్వం కీలకమైన ఒప్పందాలు చేసుకున్నది. పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయి వేలాది కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. క్లీన్ ఎనర్జీ నుంచి బ్యూటీ టెక్, ఏఐ, ఏవియేషన్ వరకు నాలుగు కీలక రంగాల్లో వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన వరుస భేటీలు, ఒప్పందాలతో తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరో పెద్ద అడుగువేసింది. దావోస్ వేదికగా తెలంగాణ అభివద్ధి కథ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.
క్లీన్ ఎనర్జీ రంగంలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ విద్యుత్ ప్రాజె క్ట్ నుంచి, ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్, ఏఐ--సెమీకండక్టర్ భాగస్వామ్యా లు, విమానయాన రంగంలో మెయింటెనెన్స్ రిపేర్ యూనిట్ల వరకు-వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక రూ పురేఖలు మారనున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో దావోస్‌లో జరిగిన కీలక సమావేశాలు, ఒప్పందాలు తెలంగాణను గ్రీ న్ ఎనర్జీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఇండస్ట్రీలకు గ్లోబల్ గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా చారిత్రాత్మక మలుపుగా మారాయి.
12,500 కోట్లతో స్టీల్ ప్టాంట్ ఏర్పాటు
డక్టైల్ ఐరన్(డీఐ) పైపుల తయారీలో ప్ర పంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్, తెలంగాణలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ప్రపంచ ఆర్థి క వేదిక---2026 సదస్సులో భాగంగా దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి నేతత్వంలోని ‘తెలం గాణ రైజింగ్’ ప్రతినిధి బందం రష్మి గ్రూప్ తో కలిసి రూ.12,500 కోట్ల పెట్టుబడికి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చు కుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ర్టంలో 12 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.
తెలంగాణ విభిన్న పరిశ్రమలతో బలమైన పారిశ్రామిక వ్యవస్థగా ఎదుగుతోందని, ముఖ్యంగా తయారీ రంగానికి ప్ర భుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని సహాయాలు, బొగ్గు సరఫరా లింకేజీలు సహా అం దిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రష్మి గ్రూప్ ప్రమోటర్ సజ్జన్ కుమా ర్ పట్వారి, డైరెక్టర్ సంజిబ్ కుమార్ పట్వారి తెలంగాణ రైజింగ్ బందంతో భేటీ అయ్యా రు.
స్టీల్ ప్లాంట్ లేబర్--ఇంటెన్సివ్ తయారీ విధానంతో పనిచేస్తుందని, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని డైరెక్టర్ సంజిబ్ కుమార్ తెలిపారు. గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీ వంటి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యంపై కూడా చర్చలు జరిగాయి. రష్మీ గ్రూపు ఆసియాలోని 40 దేశాలు, యూరప్, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికా దేశాల్లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
6 వేల కోట్లతో రియాక్టర్ విద్యుత్ ప్లాంట్
క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. రూ. 6 వేల కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్‌ఎంఆర్) ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడకట్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) సమర్పించింది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక-2026 సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐక్యూ క్యాపిటల్ గ్రూప్ చైర్మన్ డా. జాన్ బాబిక్, గ్రూప్ సీఈఓ , డైరెక్టర్ అనిల్ కుమార్ బావిసెట్టి, గ్రీన్ హౌస్ ఎన్విరో సీఈ ఓ, డైరెక్టర్ మొలుగు శ్రీపాల్ రెడ్డి, స్లోవాక్ రిపబ్లిక్ కాన్సుల్ మాటుస్ జెమెస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
2047 నాటి కి నెట్ జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడం లో సుస్థిర అభివృద్ధే తెలంగాణకు ప్రధానమ ని స్పష్టం చేశారు. స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్‌కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యం లో న్యూక్లర్ ప్రొడకట్స్ సంస్థ ఏర్పడింది. గరిష్ఠంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో తెలం గాణలో కొత్త విద్యుత్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం పెట్టుబడి విలువ 600 మిలియన్ యూరోలు (సుమారు 6,000 కోట్లు).
అమెరికా సంస్థ సర్గాడ్ 1,000 కోట్ల పెట్టుబడి..
విమానయాన రంగంలో పేరొందిన అమెరికాకు చెందిన సర్గడ్ సంస్థ రాష్ట్రంలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ నెలకొల్పనుంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో దశలవారీగా రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో సర్గాడ్ సంస్థ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా దావోస్‌లో సర్గా డ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీనివాస్ తోట సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణలో విమానాల నిర్వహణ, మరమ్మత్తులు, పునరుద్ధరణ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆసక్తిని సంస్థ ప్రతినిధులు వ్య క్తం చేశారు. సర్గాడ్ సంస్థకు ఏరోస్పేస్, రక్ష ణ, ఆటోమొబైల్, అడ్వానస్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో విశేష అనుభవం ఉంది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడు తూ.. తెలంగాణను మూడు ప్రత్యేక జో న్లుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సేవల రంగానికి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), తయారీ రంగానికి పెరి అర్బ న్ రీజియన్ ఎకానమీ(ప్యూర్), వ్యవసా యం, గ్రీన్ ఎకానమీ కి రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ(రేర్)లను ఏర్పాటు చేస్తు న్నట్లు తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్‌లలో రెండు కొత్త విమానాశ్రయాలు ఏర్పా టు చేస్తున్నామని , ఈ ప్రాంతాల్లో ఏదైనా ఒక చోట ఎంఆర్వో కేంద్రం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సంస్థ సీఈఓకు రేవంత్‌రెడ్డి సూచించారు. వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి అత్యధిక ప్రోత్సాహకాలు అంది స్తామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చా రు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఈ పెట్టుబడులతో తెలంగాణలోని ఎంఎస్‌ఎంఈలకు పరి కరాల తయారీ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయని తెలిపారు.
బ్లైజ్ కంపెనీ.. రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ సెంటర్ విస్తరణ
తెలంగాణ ప్రభుత్వం దావోస్‌లో కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సంస్థ డేటా సెంటర్ అర్టిఫిషియల్ కం ప్యూటింగ్‌కు తక్కువ శక్తి వినియోగించే ఏఐ హార్డ్వేర్, ఫుల్-స్టాక్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో బ్లైజ్ కో ఫౌండర్ సీఈఓ దినాకర్ మునగా లా సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల అనంతరం ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, సె మీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు వేగవంతమవుతాయి.
ఇప్పటికే బ్లైజ్ సంస్థ హైదరాబాద్‌లో రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్, ఇంజినీరింగ్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. తమ ఆర్ అండ్ డీ సెంటర్‌ను విస్తరించే పెట్టుబడులు, ప్రణాళికలపై ఈ సందర్భంగా చర్చ లు జరిగాయి. హెల్త్‌కేర్ డయాగ్నోస్టిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్, ఎనర్జీ ఎఫిషియెన్సీ వంటి రంగాల్లో ఏఐ ద్వారా పరి ష్కారాలను పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేసే అవకాశాలపై కూడా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడు తూ.. తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్ గా తీర్చిదిద్దడం, వచ్చే రెండు దశాబ్దాల్లో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యానికి అత్యంత కీలకమని అన్నారు.
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, క్వాంటం కంప్యూటింగ్, హార్డ్వేర్, ఆటోమేషన్ రంగాల్లో తెలంగాణ వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. దేశంలోనే టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ వృద్ధి సాధిస్తోందన్నారు. బ్లైజ్ సంస్థ హైదరాబాద్ ఆర్ అండ్ డీ యూనిట్ విస్తరణకు ప్రభుత్వం తగిన మద్దతు అందిస్తుందని హామీ ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బా బు మాట్లాడుతూ. రాష్ట్రంలో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నట్లు చె ప్పారు. ఏఐ రంగంలో పెట్టుబడులు, పరిశోధనలు, ఆవిష్కరణలకు ఇది వ్యూహాత్మక కేం ద్రంగా పనిచేస్తుందన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి ఏఐ గమ్యస్థానంగా తీర్చిదిద్దాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఏబీ ఇన్‌బెవ్ యూనిట్ విస్తరణకు సిద్ధం
ప్రపంచంలో అతిపెద్ద బీరు తయారీ సం స్థగా పేరుగాంచిన ఏబీ ఇన్‌బెవ్ తెలంగాణ లో ఇప్పటికే ఉన్న తన తయారీ యూనిట్ ను విస్తరించేందుకు భారీగా పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 50కుపైగా దేశాల్లో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా దావోస్‌లో.. సీఎం రేవంత్ రెడ్డి నేతత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బందం ఏబీ ఇన్‌బెవ్ చీఫ్ లీగల్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ జాన్ బ్లడ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం రెండు తయారీ యూనిట్లు నిర్వహిస్తున్న ఏబీ ఇన్‌బెవ్ సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. రాష్ట్రానికి కొత్త పెట్టుబడి లభించినందుకు రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా ఆదాయ వద్ధి, సామర్థ్య నిర్మాణమే కీలకమని సీఎ వ్యాఖ్యానించారు. మంత్రి శ్రీధర్‌బాబు మా ట్లాడుతూ.. విధాన స్థిరత్వం, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, వ్యాపార సౌలభ్యంతో తెలంగాణలో పెట్టుబడిదారుల్లో దీర్ఘకాలికంగా విశ్వాసం పెరుగుతోందన్నారు. తెలం గాణ ప్రభుత్వం ఏర్పా టు చేసిన టాస్క్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యువతకు ఉద్యోగాలు వచ్చేలా నైపుణ్యాలు నేర్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించిందని, ఇది చాలా గొప్ప ఆలోచన అని సిస్కో గ్లో బల్ ఇన్నోవేషన్ ఆఫీసర్ గై డీడ్రిచ్ ప్రశంసించారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై టాటా ఛైర్మన్ ఆసక్తి..
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ విజన్--2047, ప్రభుత్వ విధానాలు, రాష్ర్టంలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని టాటా చైర్మన్‌కు వివరించారు. తెలంగాణ రాష్ర్టం రూపొందించిన దీర్ఘకాలిక అభివద్ధి ప్రణాళికలను వివరించారు. భవిష్యత్ అవసరాలకు ప్రణాళికాబద్ధమైన ఆలోచన విధానంపై టాటా చైర్మన్ చంద్రశేఖరన్ ప్రశంసించారు. పెట్టుబడుల కోసం కాకుండా, విధానాలు, ఫ్యూచర్ విజన్?ను ప్రపం చానికి పరిచయం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ముందుకెళ్తోందని ఆయన అభినందించారు.
హైదరాబాద్‌లోని ప్రధాన క్రీడా మైదానాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే ఆలోచనలను సీఎం రేవంత్‌రెడ్డి.. టాటా గ్రూప్ చైర్మన్ తో పంచుకున్నారు. స్పోర్ట్స్ స్టేడియం అభివద్ధిలో భాగస్వామ్యం పంచుకునేందుకు, ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రశేఖరన్ తెలిపారు. దేశంలో ప్రతిభ ఉన్నా.. దానికి తగిన మౌలిక సదుపాయాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. యువత నైపు ణ్యాల అభివద్ధిపై కూడా చర్చించారు. 65 ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చడంలో టాటా టెక్నాలజీస్‌తో కలిసి పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ సెంటర్లుగా అభివద్ధి చేసే ప్రణాళికలను వివరించారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఆనంద్ మహీం ద్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు ఆలోచనలు.. 2036 ఒలింపిక్స్‌లో భారత్ పతకాలు సాధించేలా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. హైదరాబాద్‌లో చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై టాటా చైర్మన్ ఆసక్తి చూపారు. మూసీ అభివద్ధిలో భాగస్వామిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
లోరియల్.. ప్రపంచంలోనే తొలి బ్యూటీటెక్ జీసీసీ
ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు లోరియల్ సంస్థ ప్రకటించింది. ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్‌లో ప్రారంభించనుంది. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 2026లో సీఎం రేవంత్‌రెడ్డి, లోరియల్ సీఈవో నికోలస్ హియోరోనిమస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులతో బ్యూటీ టెక్ జీసీసీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ జీసీసీ ఏర్పాటుతో లోరియల్‌కు గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా నిలవనుంది.
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ, అనలిటిక్స్ రంగాల్లో రూపొందించే సాంకేతిక పరిష్కా రాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్ యూనిట్లకు అందిస్తామని హియెరోనిమస్ తెలిపారు. నవంబర్‌లో జీసీసీ ప్రారంభోత్స వానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులను లోరియల్ ఆహ్వానించింది. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. లోరియల్ జీసీసీని హైదరాబాద్‌కు తీసుకురావాలన్న ఆలోచనపై సీఎం ప్రత్యేక ఆసక్తి చూపారని, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన ప్రదేశమని చెప్పారు. మెడ్‌టెక్, హెల్త్‌టెక్ మాత్రమే కాకుండా బ్యూటీ టెక్ వంటి కొత్త విభాగాల్లోనూ తెలంగాణ ముందుంటోందని మంత్రి అన్నారు.
తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ గురించి ప్రతినిధి బృందం ఈ సందర్భంగా వివరించింది. జీసీసీతో పాటు మాన్యుఫాక్షరింగ్ యూనిట్ ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని లోరియల్‌ను ఆహ్వానించారు. రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు, పరిశ్రమల ఎకోసిస్టంను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో తయారీ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు హియెరోనిమస్ సానుకూలంగా స్పందించారు.
హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలి ‘స్విస్ మాల్’
ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సందర్భంగా దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్విట్జర్లాండ్‌లోని వాడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భారత్---స్విట్జర్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సహకార పెంపుపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్---2047 విజన్‌ను స్విస్ ప్రతినిధులకు వివరించారు.
హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలిసారి ‘స్విస్ మాల్’ ఏర్పాటు చేయాలనే ఆలోచనను ముఖ్యమంత్రి ప్రతిపాదించగా, స్విస్ బందం వెంటనే సానుకూలంగా స్పందించింది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఫుట్‌బాల్ ఆటగాళ్లే కావడంతో, క్రీడల రంగంలో భాగస్వామ్యంపై కూడా విస్తతంగా చర్చించారు. కాగా మహిళా సాధికారతకు సంబంధించి స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలపై స్విస్ బృందం ఆసక్తి కనబరిచింది. సహకార అంశాలు పరిశీలించేందుకు త్వరలోనే స్విట్జర్లాండ్ బందం హైదరాబాద్‌కు వస్తుందని వాడ్ రాష్ట్ర పరిశ్రమలు, ఆర్థిక శాఖ మంత్రి ఇసబెల్ మోరెట్ తెలిపారు.