calender_icon.png 22 January, 2026 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధ్వంసం X కుట్రలమయం

22-01-2026 03:23:25 AM

సిరుల సింగరేణి రగులుతోంది..!

తెలంగాణకు గుండె సింగరేణి. నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల వ్యవహారంలో సింగరేణి ఇప్పుడు కుతకుతలాడుతోంది. తెలంగాణ గుండె మండుతోంది. కనీవినీ ఎరుగనిరీతిలో నిబంధనలు విధించి టెండర్ దక్కించు కోవాలన్న రాజకీయ, కార్పొరేట్ శక్తుల వలలో సింగరేణి కార్మికులు గిజగిజలాడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ స్కాంలో పీకల్లోతు ఊబిలో కూరుకుపోయింది. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు విపక్షాలు పట్టుపడుతుండగా.. వేళ్లన్నీ కాంగ్రెస్ పెద్దలవైపే చూపిస్తున్నాయి. ఈ కుంభకోణంలో బొగ్గు మరకలు కొన్ని మీడియా సంస్థలకూ అంటుకున్నాయి. సీబీఐ దర్యాప్తునకు సిద్ధమేనని చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని బీజేపీ కుండబద్ధలు కొట్టింది.

సీబీఐ కాకపోతే సిట్టింగ్ జడ్జితోనైనా స్వతంత్ర విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తున్నది. అక్రమ మార్గంలో ‘నైనీ’కి టెండర్ వేసిందెవరు?.. ఈ కుంభోణంలో పాత్రధారులెవరు?, సూత్రధారులెవరు?  సింగరేణి వేదికగా తెరలేచిన ఈ భారీ కుంభకోణంపై చివరకు మిగిలేది ఆరోపణలు, ప్రత్యారోపణలేనా? నిజాలు నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు జరిపించేనా.. రగులుతున్న సింగరేణిని సరైన బాటన పెట్టేనా? ఇప్పటికే సింగరేణిని నామమాత్రం చేసిన పాలకుల విధానాలు ఇకపై మారుతాయా.. రక్తం ధారపోస్తున్న సింగరేణి కార్మికుల నెత్తిన ఈ కుంభకోణాల భారం ఎందుకు? అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. 


సీబీఐ దర్యాప్తునకు.. మేం సై

  1. సింగరేణిని కేంద్రానికి అప్పగిస్తే బాధ్యతలు తీసుకుంటాం 
  2. మంత్రుల మధ్య వాటాల కొట్లాట 
  3. రాష్ట్ర ప్రభుత్వం 47 వేల కోట్లు బకాయి ఎప్పుడిస్తారో చెప్పాలని లేఖ రాస్తా 
  4. ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): సింగరేణిపై సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుందని, సింగరేణిని లాభాల బాటలో నడిపేందుకు తమకు అప్పగిస్తే.. ఆ బాధ్యతను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం గా ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నా రు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు సింగరేణి రాజకీయ ప్రయోగశాలగా మారిందని, వారు చేసిన విధ్వంసంతోనే లాభాల బాటలో ఉన్న సింగరేణి, నష్టాల బాటలో పయనిస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు మంత్రుల మధ్య వాటాల విషయంలో ఈ వ్యవహారం బయటికి వచ్చిందన్నారు.

కేంద్రం, రాష్ట్రం, సింగరేణి మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరగాల్సిన అవసరముందని, భవిష్యత్తులో జరిగే టెండర్లు, ఇతర ప్రక్రియపై విస్తృతంగా చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. సింగరేణిని ప్రక్షాళన చేయాల్సి ఉంద ని, సంస్థను బలోపేతం చేసేందుకు కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉందని, ముఖ్యంగా ఒడిశాలోని నైనీ బ్లాక్ వంటి కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపులో కేంద్ర చొరవ తీసుకుంటుంద న్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 47 వేల కోట్లు బకాయి పడింద ని, ఆ నిధులను ఎప్పుడిస్తారని ఆయ న ప్రశ్నించారు.

బకాయిలు ఇవ్వాలని గత ప్రభుత్వానికి లేఖ రాశానని, మళ్లీ ఇప్పుడు క్రాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా రాస్తానని ఆయన స్పష్టం చేశారు. సింగరేణిలో జరుగుతున్న వ్యవహారంపై అత్యవస రంగా బోర్డు మీటింగ్ పెట్టి ఈ అంశాలపై చర్చించినట్లు ఆయన వెల్లడించారు. సింగరేణి భూములు ఆక్రమణకు గురవుతున్నా యని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారు తమ ఎమ్మెల్యేలకు సింగరేణి భూములను కట్టబెడుతున్నారని వ్యాఖ్యలు చేశారు.

బీఆర్‌ఎస్ హయాంలో అనేక రకాల అక్రమాలు జరిగాయని, గతంలో నైనీ కోల్ బ్లాక్ టెండర్ల ప్రక్రియలో సీఎం జోక్యం చేసుకొని రద్దు చేస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించి రద్దు చేసిందన్నారు. సింగరేణి మైనింగ్‌కు ముందుకొస్తే బీఆర్‌ఎస్ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిందని, నైనీ బ్లాక్ అక్రమాలపై చర్చ జరగాలని, సింగరేణి అస్తిత్వానికి ప్రమాదం ఏర్పండిందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి టెండర్ల విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో బుధవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 

సమస్యల్లో సింగరేణి..

గత కొన్ని రోజులుగా.. సింగరేణికి సంబంధించిన ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌పై చర్చ జరుగుతోందని, 8 జిల్లాలకు పైగా విస్తరించిన సింగరేణి తెలంగాణ అభివద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం.. సింగరేణి సంస్థకు నైని కోల్ బ్లాక్‌ను కేటాయించిందని, 2015లోనే ఈ బ్లాక్ కేటాయించి.. కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులను సరైన సమయంలో అందించామన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నైని కోల్ బ్లాక్ విషయంలో.. టెండర్లను ఆహ్వానించి.. ముఖ్యమంత్రి చివరి నిమిషంలో వెనక్కు తగ్గారని, ఇవాళ కాంగ్రెస్ కూడా.. అదే పద్ధతిలో.. టెండర్లను ఆహ్వానించి.. వెనక్కు తగ్గిందన్నారు.

నైనీ బ్లాక్‌కు తుది అనుమతులు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకమైన పద్ధతిలో పనులు చేపట్టాల్సింది పోయి ఆలస్యం చేసిందని, అనేక అక్రమాలు, అవినీతి జరిగినట్లు వార్తలు రావడం దురదష్టకరమన్నారు. బొగ్గు వెలికి తీయడం, బొగ్గు రవాణాకు సం బంధించి.. టెండర్లో.. ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ నిబంధనను సింగరేణి యాజమాన్యం.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చేర్చిందని కిషన్‌రెడ్డి అన్నారు. సింగరేణిలో.. ‘సైట్ విజిట్’ నిబంధనను తప్పనిసరి చేసి..అవినీతికి బాటలు వేసి బొగ్గు వెలికి తీసే ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని పేర్కొన్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరంలేదని, కేవలం సెల్ఫ్ డిక్లరేషన్ ఉం టే చాలన్నారు. ఎన్‌టీపీసీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు.. సింగరేణి బొగ్గు తమకు వద్దని అంటున్నాయని.  దీనిపై తెలంగాణ సీఎస్‌కు లేఖ రాస్తామన్నారు.

రాష్ట్ర అనుమతి ఉండాలిగా.. 

కోల్ బ్లాక్‌కు సంబంధించి సీబీఐ దర్యాప్తు జరపాలి.. కేంద్రమంత్రి ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని, సీబీఐ దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలనే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ నాయకులకు ఆయన కౌంటరిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ ఏం చేసిందని, కేంద్రానికి 49 శాతం భాగస్వామ్యం ఉన్న విషయాలు మరిచిపోయారా? అని ప్రశ్నించారు. కొన్ని సంస్థలకు, కొందరు వ్యక్తులకు లాభం చేసేలా వ్యవహరించిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. తాడిచర్ల కోల్ బ్లాక్‌ను జెన్‌కోకు కేటాయించి దీని మైనింగ్ చేసేందుకు సింగరేణి ముందుకొస్తే.. వారితో ‘మేం పనిచేయలేమని లేఖ రాయించుకుని’ ప్రైవేటు కంపెనీకి 25 ఏళ్ల టెండర్ కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 

బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చి జీతాలిస్తున్నారు.. 

దేశంలో ఏ కోల్ మైనింగ్ కంపెనీ కూడా.. ఈ స్థాయిలో ఇబ్బందుల్లో లేదని, సింగరేణి పట్ల, కార్మికుల సంక్షేమం పట్ల.. నాడు బీఆర్‌ఎస్, నేడు కాంగ్రెస్ పార్టీల చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. బ్యాంకులనుంచి డబ్బులు తెచ్చి కార్మికులకు సింగరేణి జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. సింగరేణిలో జీ11 గ్రేడ్ కోల్ అమ్మకం ధర.. టన్నుకు రూ. 4,088.. ఉంటే, ఇదే కోలిండియాలో.. జీ11 గ్రేడ్ కోల్ ధర రూ.1,605 మాత్రమే ఉందన్నారు.  దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ.. రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిమీద పడి దోచుకుంటున్నాయి కాబట్టే.. సంస్థను నడిపేందుకు వారి వద్ద ధరలను పెంచడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదన్నారు. సింగరేణి కోల్ కొంటున్న జెన్‌కో కూడా ప్రభుత్వ సంస్థనే కాబట్టి.. సింగరేణి ధరలు పెంచుకుంటూ పోతోందని, సింగరేణి బొగ్గు క్వాలిటీ.. 58 శాతం ఉండగా.. కోలిండియాలో బొగ్గు క్వాలిటీ 86 శాతంగా ఉందన్నారు. సింగరేణి అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది కాబట్టి.. క్వాలిటీ విషయంలో, రేట్ విషయంలో తప్పటడుగులు వేస్తోందని పేర్కొన్నారు. 

మేఘా స్కాం నీడలు!

సింగరేణిపై ఆధిపత్య పోరు

* టెండర్ రద్దు ప్రక్రియ కొత్త రాజకీయ యుద్ధానికి దారితీసింది. టెండ ర్లు కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే జరిగాయని భట్టి విక్రమార్క సమర్థిం చుకోగా, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ విధానం ఏ ఇతర బొగ్గు సంస్థలో లేదని, ఇది కేవలం మేఘా కోసమే తెచ్చిన స్కాం అని ఆయన ధ్వజమెత్తారు. ఇదే నిబంధనలతో గతంలో 7 నుంచి -10 శాతం అధిక ధరలకు కట్టబెట్టిన మరో ఆరు సింగరేణి టెండర్లపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పెద్దల వాటాలు తేలకపోవడంతో శ్రీరాంపూర్ ఓసీ (ఎస్‌ఆర్‌పీ ఓసీ టెండర్లను 2025లో మూడుసార్లు పిలవాల్సి వచ్చిందని  హరీశ్ ఆరోపించారు.

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి) : సుమారు 40 వేల మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తూ, ఏడాదికి సుమారు 70 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తిచేసే ప్రభుత్వ రంగ దిగ్గజం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) సంస్థ. అలాంటి ప్రసిద్ధ సంస్థ ఇప్పుడు కార్పొరేట్ కుట్రలు, రాజకీయ వ్యూహాల సుడిగుం డంలో చిక్కుకుంది. ఈ వివాదానికి కేంద్రబిందువు హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజ నీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్). ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఉన్న అత్యంత కీలకమైన ‘నైనీ’ బొగ్గు గని కాంట్రాక్టును చేజిక్కించుకోవడానికి ఈ మేఘా సంస్థ అడ్డదారులు తొక్కిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

350 మిలియ న్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న నైనీ బ్లాక్‌ను 2015లో సింగరేణికి కేటాయించారు. తెలంగాణ విద్యుత్‌కు కావాల్సిన ఇంధన అవసరా ల్లో 60 శాతాన్ని తీర్చే సింగరేణికి ఈ బొగ్గు బ్లాక్ అత్యంత కీలకం. అయితే, మేఘా సంస్థ కు లబ్ధి చేకూర్చేలా టెండర్ నిబంధనలను రూపొందించారన్న వార్తలు, మీడియా కథనాలు, ప్రభుత్వ సత్వర జోక్యంతో ప్రస్తుతాని కి ఆ ప్రక్రియ ఆగింది. ఇది సింగరేణి ప్రతిష్ట ను కాపాడినా.. అంతర్గతంగా మాత్రం.. కా ర్పొరేట్ శక్తులు, -ప్రభుత్వాల మధ్య ఉన్న లో తైన అవినీతి సంబంధాలను బయటపెట్టింది.

‘మేఘా’ మాయాజాలం..

2025 చివరలో నైనీ గనుల తవ్వకాల కోసం సింగరేణి టెండర్లు పిలిచింది. ఇందు లో మేఘా సంస్థ జాయింట్ వెంచర్ ద్వారా ముందంజలో ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, పోటీలో ఉన్న ‘సుశీల్ హైటెక్’ వంటి సంస్థలు ఈ టెండర్ నిబంధనలపై అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. ఇందులో ముఖ్యంగా ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ (సింగరేణి జనరల్ మేనేజర్ జారీ చేయాలి) తప్పనిసరి చేయడంతోపాటు టెండర్ ముగియడానికి కేవలం రెండు రోజుల ముందే ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) సమర్పించాలన్న నిబంధనలు కేవలం మేఘా కోసమే రూపొందించారనే విమర్శలు వచ్చాయి.

ఇది ఒక రకమైన ‘సిండికేట్’ ఏర్పాటు అని, తమకు అనుకూలమైన వారికే కాంట్రాక్టును కట్టబెట్టే ప్రయత్నమని పోటీ సంస్థలు ఆరోపించారు. దీనితో కార్పొరేట్లు, మీడియా సంస్థలు, రాజకీయ వర్గాల మధ్య నిట్టనిలువుగా వచ్చిన చీలికలను బహిర్గతం చేసేలా రెండు ప్రధాన తెలుగు మీడియా సంస్థలు వార్తాకథనాలను ప్రచురించాయి. ఈ వివాదం ముదరడంతో, జనవరి 18, 2026న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రంగంలోకి దిగి టెండర్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

రాజకీయ రణరంగం..

టెండర్ రద్దు ప్రక్రియ కొత్త రాజకీయ యుద్ధానికి దారితీసింది. టెండర్లు కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే జరిగాయని భట్టి విక్రమార్క సమర్థించుకోగా, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ విధానం దేశంలో ఏ ఇతర బొగ్గు సంస్థలో లేదని, ఇది కేవలం మేఘా కోసమే తెచ్చిన స్కామ్ అని ఆయన ధ్వజమెత్తారు. ఇదే నిబంధనలతో గతంలో 7 నుంచి -10 శాతం అధిక ధరలకు కట్టబెట్టిన మరో ఆరు సింగరేణి టెండర్లపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేవలం నైనీ బొగ్గు బ్లాక్ టెండర్‌ను మాత్రమే ఎందుకు రద్దు చేశారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోని పెద్దలకు ఇవ్వాల్సిన వాటా తేలకపోవడంతో శ్రీరాంపూర్ ఓసీ-2 (ఎస్‌ఆర్‌పీ ఓసీ-2) టెం డర్లను 2025లో మూడుసార్లు పిలవాల్సి వచ్చిందని  హరీష్‌రావు ఆరోపించారు. అటు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కూడా ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

వివాదాల ‘మేఘా’ చరిత్ర..

ఇదే సమయంలో చత్తీస్‌గఢ్‌లోని ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సుశీల్ హైటెక్ సంస్థకు చెందిన రూ. 50 లక్షల ఈఎండీని సీజ్ చేయడంతోపాటు రూ. 125 కోట్ల పనులకు సంబంధించిన సెక్యూరిటీని సమర్పించ కపోవడంతో ఒక సంవత్సరంపాటు నిషేధం విధించినట్టు మీడియాలో కథనాలు వచ్చా యి. దీనికి పోటీగా అన్నట్టు మేఘా సంస్థపై గతంలో వచ్చిన ఆరోపణలపై కథనాలు వెలువడ్డాయి. కేరళలో ఎన్‌హెచ్ -66లో భాగంగా చెంగాల-నీలేశ్వరం మధ్యన జరిగిన రహదారి పనులలో రక్షణవాలు కూలిపోవడంతో.. మేఘా సంస్థపై 2025 జూన్ 16న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఒక సంవత్సరం పాటు నిషేధం విధించింది.

ఈ నిషేధం విషయం బయటకు వస్తే తెలంగాణలో పిలిచిన టెండర్లలో మేఘా సంస్థ పాల్గొనేందు కు అర్హత ఉండదని, ఈ సమాచారమంతా తొక్కిపెట్టి.. మేఘా కంపెనీని రూ. 7600 కోట్ల విలువైన మూసి పునరుజ్జీవనం వంటి భారీ ప్రాజెక్టులు అప్పగించారని విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. ఇదిలాఉండగా నే.. తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం.. బీహార్‌లో కోసి కాలువ పనుల్లో సదరు సంస్థ జాప్యంపై అక్కడి ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే అవకాశం ఉంది. 

ప్రమాదంలో సింగరేణి..

1920లో స్థాపించబడిన సింగరేణి కేవలం ఒక సంస్థ కాదు, తెలంగాణకు గర్వకారణం. ఏటా రూ.30 వేల కోట్ల ఆదాయం తెచ్చే ఈ సంస్థపై వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ప్రైవేటీకరణ వల్ల ఉపాధి భద్రత పోతుందని, కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని టీజీబీకేఎస్ లాంటి కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు కార్మికుల జీతభత్యాలు 30 నుంచి 40 శాతం వరకు తగ్గుతాయని, అలాగే భద్రత విషయంలో రాజీ పడటంతో.. ప్రమాదాలు పెరుగుతాయని, కేరళలో ఎంఈఐఎల్ చేపట్టిన పనులే ఇందుకు ఉదాహరణ అని కార్మిక సంఘా లు అంటున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుం టుందా? మైనింగ్ చేసిన అనుభవం ఉండాలనే నిబంధనలను అమలుచేస్తుందా? ఎక్కువ మంది బిడ్డర్లు పాల్గొనేలా చర్యలు తీసుకుంటూ.. సిండికేట్ వ్యవస్థను బద్దలు కొడుతుందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నా యి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పారదర్శకతకు పెద్దపీట వేయాల్సి ఉంది. ‘మేఘా’ వంటి సంస్థ ల నీడలో సింగరేణి అస్తిత్వం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. బీఆర్‌ఎస్ చేస్తున్న ‘కాంట్రాక్ట్ సర్కార్’ ఆరోపణలపై బీజేపీ దర్యాప్తు చేయాల్సిందేనన్న భావన ప్రజల్లో బలంగా కలిగింది.