22-01-2026 03:07:03 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 21 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు అనూహ్య మలుపులు తిరుగుతోంది. నిందితుడిగా భావించి మాజీ మంత్రి హరీశ్‌రావును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్.. విచారణలో విస్మయకర విషయాలను వెల్లడించినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హరీశ్‌రావు ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం జరిగిన విచారణలో సిట్ అధికారు లు ఈ అంశాన్ని ఆధారాలతో సహా హరీశ్‌రావు ముందుంచడంతో ఆయన ఖంగుతి న్నట్లు సమాచారం.
దీంతో ఈ కేసులో హరీశ్‌రావు నిందితుడా.. లేక బాధితుడా.. అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన కొత్తలో హరీశ్‌రావు ఫోన్‌ను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసింది. దాదాపు ఏడాది పాటు హరీశ్‌రావుతో పాటు ఆయన ముఖ్య అనుచరుల కదలికలపై నిఘా ఉంచింది. ఏయే తేదీల్లో, ఏయే సమయాల్లో సంభాషణలు రికార్డయ్యాయనే చిట్టాను అధికారులు హరీశ్‌రావు ముందుంచారు. అయితే, ఈ ఆధారాలను చూసిన హరీశ్‌రావు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే.. ఈ ప్రశ్నలు, ఆధారాలు మీరే సృష్టించారా.. నేను వీటిని నమ్మను.. అని పోలీసులను ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
హరీశ్ అనుచరుల ఫోన్లు కూడా..
ప్రణీత్ రావు బృందం కేవలం హరీశ్‌రావునే కాకుండా, ఆయన వెంటే ఉండే ప్రధాన అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. దీనిపై మరింత స్పష్టత కోసం హరీశ్‌రావుకు అత్యంత సన్నిహితులుగా ఉండే ఆరుగురు ముఖ్య అనుచరులకు త్వరలోనే నోటీసులు జారీ చేయాలని సిట్ నిర్ణయించింది. వారిని పిలిపించి విచారిస్తే మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
తెలియదు.. గుర్తులేదు
దుదుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయించారన్న ఆరోపణలపై సిట్ అధికారులు హరీశ్ రావును ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, శ్రవణ్ రావులతో ఉన్న లింకులు ఏమిటని ఆరా తీశారు. ముఖ్యంగా 2023 ఎన్నికలకు ముందు వరకు శ్రవణ్ రావు ఇచ్చిన నంబర్లను ప్రణీత్ రావు ట్యాప్ చేయడానికి కారణమేంటని ప్రశ్నించగా.. హరీశ్‌రావు నుంచి సరైన సమాధానం రాలేదని సమాచారం. శ్రవణ్ రావు, ప్రణీత్ రావు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లను ముందుంచగా.. నాకు తెలియదు, గుర్తులేదు అంటూ సమాధానాలు దాటవేసినట్లు తెలిసింది.
2018లో గెలిచిన తర్వాత హరీశ్‌రావును క్యాబినెట్లోకి తీసుకోవడంలో జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కేసీఆర్ ఆయనపై అనుమానంతోనే నిఘా పెట్టించారనే గుసగుసలు అప్పట్లో వినిపించాయి. నా ఫోన్ ట్యాప్ అవుతోంది.. ఎవరూ నాకు ఫోన్ చేయకండి అని హరీశ్‌రావు చెప్పేవారని గతంలో వి. ప్రకాష్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కవిత, ఆమె భర్త తర్వాత ఇప్పుడు హరీశ్‌రావు ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందనే వార్తలు బయటకు రావడంతో.. ఇది సొంత పార్టీలో జరిగిన అంతర్గత కుట్రనా.. లేక మరేదైనా కారణం ఉందా.. అనేది మిస్టరీగా మారింది.