22-01-2026 03:48:06 AM
ఫోన్ ట్యాపింగ్ కేసుతో బీఆర్‌ఎస్‌లోఉత్కంఠ
హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్ రావు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లిన హరీశ్ రావు, గులాబీ బాస్‌తో సమావేశమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా మంగళవారం హరీశ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. దాదాపు ఏడు గంటలపాటు సాగిన ఈ విచారణ ముగిసిన మరుసటి రోజే కేసీఆర్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. సిట్ విచారణ సంద ర్భంగా అధికారులు అడిగిన ప్రశ్నలు, తాను ఇచ్చిన సమాధానాలపై హరీశ్ రావు కేసీఆర్‌తో చర్చించినట్లు సమాచారం.
ఈ భేటీ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. అలాగే హరీశ్ రావుకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతున్న పరిణామాలు బీఆర్‌ఎస్ పార్టీలో ఉత్కంఠను పెంచుతున్నాయి. ఇప్పటికే పలువురు అధికారులు, మాజీ అధికా రులు సిట్ విచారణను ఎదుర్కొనగా, హరీశ్ రావు విచారణ తర్వాత సిట్ తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉండగా, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణను బీఆర్‌ఎస్ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి. అప్పట్లో కమిషన్ ముందు హరీశ్ రావు విచారణకు హాజరై, అనంతరం ఎర్రవల్లిలో కేసీఆర్‌ను కలవడం, కొద్ది రోజులకే కేసీఆర్‌కు నోటీసులు జారీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడూ అదే తరహా పరిణామాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో చోటు చేసుకుంటున్నాయా? సిట్ విచారణలో తదుపరి నోటీసులు ఎవరికీ జారీ అవుతాయన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.