16-07-2025 07:58:59 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): గ్రంథాలయాలతోనే విజ్ఞానవంతమైన సమాజం ఏర్పడుతుందని జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పొ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞానవంతమైన సమాజానికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయని, గ్రంథాలయాల అభివృద్ధి, గ్రంథాలయ పన్ను పై ఆధారపడి ఉంది కాబట్టి, జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వసూలు చేసిన గ్రంథాలయ పన్ను ఎప్పటికప్పుడు, జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించి, జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి దోహదపడాలన్నారు. జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధి కోసం అధికారుల సహకారంతో పాటు, ప్రజల భాగస్వామ్యం దాతల దాతృత్వం ఎంతైనా అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయాల అభివృద్ధి కోసం సహకరించి, విజ్ఞాన వంతమైన సమాజం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి తూర్పాటి శ్రీలత, మహబూబాబాద్, మరిపెడ, డోర్నకల్, తొర్రూర్ మున్సిపల్ కమిషనర్లు టి. రాజేశ్వర్, విజయానంద్, నిరంజన్, వి.శ్యాంసుందర్, జిల్లా ఆడిట్ అధికారి మాన్వి జగన్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లావణ్య, సీనియర్ ఆడిటర్ సంపత్, కే.దేవేందర్, రుద్రారపు వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.