calender_icon.png 17 July, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నర్ పర్యటనకు భారీ బందోబస్తు

16-07-2025 07:45:04 PM

446 మంది పోలీసులతో పటిష్ట భద్రత

హుస్నాబాద్: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం సిద్దిపేట జిల్లా కోహెడ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తం 446 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నట్టు సిద్దిపేట పోలీసు కమిషనర్ అనురాధ తెలిపారు. బుధవారం ఆమె కోహెడలోని గవర్నర్ పాల్గొనబోయే మీటింగ్ ప్రదేశం, డయాస్, పబ్లిక్ గ్యాలరీ, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులకు, సిబ్బందికి భద్రతా ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు.

ఐదు సెక్టర్లుగా భద్రత

పోలీసు బందోబస్తును ఐదు సెక్టర్లుగా విభజించినట్టు సీపీ వివరించారు. ఒక అడిషనల్ ఎస్పీ, ముగ్గురు ఏసీపీలు, పదిమంది సీఐలు, 44 మంది ఎస్సైలు, 388 మంది పోలీసు సిబ్బందితో సహా మొత్తం 446 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ఈ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.

పార్కింగ్ ప్రదేశాలు

గవర్నర్ పర్యటనకు వచ్చే వాహనదారుల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు.

ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ ఎదురుగా, ఎడమవైపున : హుస్నాబాద్, అక్కన్నపేట, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల నుంచి వచ్చే వాహనదారులు ఈ ప్రదేశంలో వాహనాలను పార్కు చేసుకొని సభాస్థలికి వెళ్లాలని సీపీ అనురాధ సూచించారు.

భారత్ పెట్రోల్ పంపు వెనుక వైపున : కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్ మండలాల నుంచి వచ్చే వాహనదారులు ఈ ప్రదేశంలో తమ వాహనాలను పార్కు చేసుకొని సభాస్థలికి చేరుకోవాలని సూచించారు. సీపీ వెంట ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, కోహెడ ఎస్ఐ అభిలాష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కార్తీక్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.