25-10-2025 06:48:23 PM
మొబైల్, ఈమెయిల్ రక్షణకు చిట్కాలు
నారాయణపేట.(విజయక్రాంతి): డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించేందుకు నారాయణపేట జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం ఒక ప్రత్యేక సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ... ఇలాంటి అవగాహన సదస్సులు ప్రజల్లో డిజిటల్ బాధ్యతా భావం పెంచి, సైబర్ భద్రతా సంస్కృతిని బలపరుస్తాయని తెలిపారు.
సదస్సులో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్, సైబర్ నిపుణుడు మరియు అడ్వకేట్ రూపేష్ మిత్తల్, హైదరాబాద్ కు చెందిన సూర్యప్రకాశ్ హాజరయ్యారు. ఈ సదస్సులో ఈమెయిల్ అకౌంట్లు, మొబైల్ ఫోన్లు, వ్యక్తిగత డేటా రక్షణకు సంబంధించిన పలు చిట్కాలు, సైబర్ హైజీన్ పాటించే విధానాలు, మరియు మొబైల్ ఫోన్‌లో భద్రతా సెట్టింగులు ఎలా అమలు చేయాలో వివరించారు. కాగా సదస్సులో పాల్గొన్న వారికి నిపుణులు పాస్‌వర్డ్‌ల వినియోగం, టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్, సాఫ్ట్‌వేర్ అప్ డేట్స్ ప్రాముఖ్యత గురించి వివరించారు.
మొబైల్ భద్రత కోసం అనవసర అనుమతులు నిలిపివేయడం, ధృవీకరించని యాప్‌లను ఉపయోగించకపోవడం, ప్రైవసీ సెట్టింగులను సరిగా అమలు చేయడం వంటి సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రూపేష్ మిత్తల్ సైబర్ భద్రత అవగాహనతో మొదలవుతుందనీ, ప్రతి ఒక్కరూ తమ డేటా ప్రైవసీని కాపాడుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం చివరలో ప్రశ్నోత్తర సమావేశం నిర్వహించగా ఇందులో పాల్గొన్నవారు ఈమెయిల్ రక్షణ, మొబైల్ భద్రత, ఆన్‌లైన్ మోసాలను నివారించే మార్గాలపై ప్రశ్నలు అడిగి నిపుణుల సలహాలు పొందారు.