16 August, 2026 | 12:46 AM

అంత్యక్రియల ఖర్చుల వివాదం..

16-08-2026 12:00 AM
  1. అన్నను కత్తెరతో పొడిచి చంపిన తమ్ముడు
  2. కుమ్మరిబస్తీలో ఘటన 
  3. కేసు నమోదు చేసిన సరూర్ నగర్ పోలీసులు

ఎల్బీనగర్, ఆగస్టు 15 : తండ్రి అంత్యక్రియల ఖర్చుల విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం విషాదాంతమైంది. డబ్బుల విషయంలో జరిగిన గొడవలో త మ్ముడు కత్తెరతో అన్నపై దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంపాపేట కుమ్మరిబస్తీలో చోటుచేసుకుంది.

స్థానికుల వివరాల ప్రకారం.. కుమ్మరిబస్తీకి చెందిన వెంకటేశ్ (28), అతని తమ్ముడు శివ (26) మధ్య తండ్రి అంత్యక్రియల ఖర్చులకు సంబంధించిన డబ్బుల విషయంలో కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. అంత్యక్రియల ఖర్చుల్లో తన వాటా ఇవ్వలేదంటూ శివ తన అన్న వెంకటేశ్తో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో శనివారం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా మాటామాటా పెరిగి ఆగ్రహానికి గురైన శివ కత్తెరతో వెంకటేఖశ్‌పై దాడి చేశాడు.

తీవ్ర గాయాలతో వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న సరూర్నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టడంతో పాటు హత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.