తెలంగాణ భావజాలానికి చిరస్మరణీయ దిక్సూచి జయశంకర్
- ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
నర్సాపూర్: తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించి, ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాంతం అంకితభావంతో కృషి చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఘన నివాళులు అర్పించారు. గురువారం నర్సాపూర్‌లోని తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఆయన పాత్ర చారిత్రాత్మకమని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేస్తూ, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను దేశవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడిగా ప్రొఫెసర్ జయశంకర్ చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. తెలంగాణ కోసం ఆయన చూపిన అంకితభావం, అందించిన స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆమె అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని సునీత లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






