కేసీఆర్ గారూ.. వాసాలమర్రి పిలుస్తోంది
ఇందిరమ్మ ఇండ్ల దావత్‌కు… ఫామ్‌హౌస్ నుంచి వచ్చేందుకు సిద్ధమా..?
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మూడు నెలల సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన మంత్రి
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కూసుమంచి,(విజయక్రాంతి): వాసాలమర్రి దత్తత పేరుతో బిల్డప్ ఇచ్చిన ఫామ్‌హౌస్ దొర... మీ దత్తత గ్రామం రమ్మంటోంది.. పిలుస్తోంది.. ఇందిరమ్మ ఇండ్ల దావత్ కు రమ్మంటోంది.. ఇండ్లు కట్టించి చేతల్లో చూపిస్తున్న కాంగ్రెస్ పిలుస్తున్నది.. ఫామ్ హౌస్ వీడి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నావా దోర.. అంటూ రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆహ్వానించారు. గురువారం కూసుమంచి మండలంలో పర్యటించిన ఆయన కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని మాట్లాడారు.
వాసాలమర్రిని దత్తత తీసుకున్నానంటూ గొప్పలు చెప్పుకుని, ఆర్భాటపు ప్రచారాలు చేసుకున్న కేసీఆర్.. మూడేండ్లలో గ్రామంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని విమ్మర్శించారు. ఇండ్లు కట్టకుండానే దావత్‌ల పేరుతో ప్రచారం చేసుకున్న కేసీఆర్. ఇప్పుడు అదే వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇండ్ల దావత్‌కు వస్తారా..? అని సవాల్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాసాలమర్రిలో ప్రతి కుటుంబం సొంతింటి కలను నెరవేర్చేందుకు చర్యలు చేపట్టిందన్నారు. కేసీఆర్ దోస్త్ ఆగవ్వ ఇప్పటికే ఇందిరమ్మ ఇంట్లో ఆనందంగా నివసిస్తుండగా, గ్రామంలో సగానికి పైగా ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన ఇండ్లు కూడా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని, అవి కూడా త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. మీ దోస్త్ ఆగవ్వ సహా.. ఊరంతా ఇందిరమ్మ ఇండ్లతో కళకళలాడుతోంది. ఇప్పుడు వాసాలమర్రికి వచ్చి ప్రజల మధ్య నిలబడేందుకు సిద్ధమా, కేసీఆర్ సార్.. జర వచ్చి చూడండి మా అభివృద్ధి అంటూ షెటెర్లు వేశారు.






