04-11-2025 07:12:22 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): మత్స్యకారుల సంక్షేమంలో భాగంగా వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండలంలోని గుల్లకోట ప్రాంతంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్, మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి చేప పిల్లలను నీటిలోకి వదిలారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...... 2025 - 26 సంవత్సరానికి గాను జిల్లాలో 223.93 లక్షల చేప పిల్లలు పెంచేందుకు ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు.
జిల్లాలోని 380 చెరువులు/రిజర్వాయర్లు ఉన్నాయని, వీటిలో 369 సీజనల్ చెరువులలో 115.65 లక్షల 35- 40 మిల్లీమీటర్ల సైజు గల చేప పిల్లలు, 5 పేరినియల్, 6 రిజర్వాయర్లలో 108.28 లక్షల 80- 100 మిల్లీమీటర్ల సైజు గల చేప పిల్లలను వదలడం కొరకు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో 51.58 లక్షల ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 15 నుండి 20 రోజులలో కార్యక్రమాన్ని పూర్తిచేసే విధంగా రూట్ మ్యాప్ తయారుచేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గుల్లకోట ప్రాంతంలో మంగళవారం రోజున 24 లక్షల 42 వేల చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. చేపలపై ఆధారపడిన మత్స్య సొసైటీలు, మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు మొబైల్ చేపల విక్రయ వాహనాలను నడిపించేందుకు ప్రోత్సహించడం జరిగిందని తెలిపారు.
ఫిబ్రవరి, మార్చి 2026 నాటికి చేప పిల్లలు వృద్ధి చెందుతాయని, దాదాపు 1 వేయి మంది చేపలు పట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లాలో వినియోగంతో పాటు ఎగుమతి చేసేందుకు సరిపడా చేపల అభివృద్ధి జరుగుతుందని, ప్రణాళిక ప్రకారం సకాలంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం గుల్లకోట లోని లక్ష్మీ ప్రసన్న గ్రామ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని తెలిపారు. జిల్లాలో 345 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రేడ్ ఏ రకానికి క్వింటాలుకు 2 వేల 389 రూపాయలు, సాధారణ రకానికి క్వింటాలుకు 2 వేల 369 రూపాయలుగా మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని, సన్న రకం వడ్లకు గత సంవత్సరం మాదిరిగా మద్దతు ధరతో పాటు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు.
రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి 20 టార్పాలిన్ కవర్లను అందించడం జరిగిందని, ఎవరికైనా రానట్లయితే మార్కెటింగ్ అధికారుల సమన్వయంతో టార్పాలిన్ కవర్లను పొందాలని, అకాల వర్షాల నుండి ధాన్యం తడవకుండా కాపాడాలని తెలిపారు. ఒకవేళ ధాన్యం తడిచినట్లైతే వెంటనే తమకు సమాచారం అందించాలని, డ్రయ్యర్స్, క్లీనర్స్ సరిపడా అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించి ధాన్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసేందుకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టడం జరుగుతుందని, కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, నీడ మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, గోనె సంచులు, టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.