12-12-2025 05:57:01 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న మండలాల్లో పోలింగ్ సిబ్బందికి గందరగోళం లేకుండా పోలింగ్ సామాగ్రి పంపిణీకి ప్రణాళికబద్దంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత మండలాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్యతో కలిసి ఈరోజు వనపర్తి, కొత్తకోట మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలతో సందర్శించారు.
పోస్టల్ బాలట్ పోలింగ్ కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలు, సిబ్బంది విధుల నిర్వహణను, పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. అదేవిధంగా వనపర్తి, కొత్తకోట మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాలతో పాటు, మదనాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణల్లో శనివారం రెండో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూరు, అమరచింత మండలాల్లో పోలింగ్ సిబ్బందికి గందరగోళం లేకుండా పోలింగ్ సామాగ్రి పంపిణీకి ప్రణాళికబద్దంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
బృందాలు, గ్రామ పంచాయతీల వివరాలతో రూట్ల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట కల్లా ఇబ్బందికి సామాగ్రి పంపిణీ ప్రక్రియతో పాటు, లంచ్ పూర్తి చేసి రూట్ల వారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రెండో విడతలో పోలింగ్ జరగనున్న ఐదు మండలాల్లో డిసెంబర్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఎలాంటి ప్రచారం కానీ, ఓటర్ స్లిప్పుల పంపిణీ కానీ చేయడం జరగవద్దన్నారు. ఈ రెండు రోజుల్లో మద్యం, ధన ప్రభావం కనిపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎన్నికల సిబ్బంది అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
వనపర్తి కొత్తకోట ఎంపీడీవో కార్యాలయాల్లో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్నికల పోలింగ్ పూర్తిగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫారం 14 దరఖాస్తు చేసుకున్న వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సిబ్బంది సహకరించాలని సూచించారు. ఎన్నికల విధుల అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ, (వోటర్ ఐడీ) లేదా మరో గుర్తింపు కార్డు జిరాక్స్ తనిఖీ చేయాలన్నారు.
ఓటు వేసిన వారిని ఓటర్ లిస్ట్‌లో నమోదు చేయాలని సూచించారు ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సాయంత్రం ఐదున్నర గంటలకల్లా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ ముగించి సీల్ వేసేయాలని సూచించారు. ఆయా మండలాల తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.