calender_icon.png 11 August, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నులిపురుగుల నివారణతో ఎన్నో ఆరోగ్య సమస్యలు పరిష్కారం

11-08-2025 05:05:34 PM

జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్..

గద్వాల: నులిపురుగుల నివారణతో ఎన్నో ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయని, ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రలు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో వేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్(District Collector B.M. Santosh) అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని గద్వాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని విద్యార్థులకు మాత్రలు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నులిపురుగుల కారణాలవల్ల పిల్లల ఎదుగుదలలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయన్నారు. దీని నివారణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 11వ తేదీన (నేషనల్ డి వార్మింగ్ డే) నిర్వహిస్తుందన్నారు. ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలందరికీ నొలిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

విద్యార్థులు బాగా చదివి ఉత్తీర్ణత శాతం మరింత మెరుగుపరచాలి..

గత సంవత్సరం పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో మంచి ప్రగతి సాధించి-గద్వాల జిల్లా స్థాయిలో 32వ స్థానంలో నుండి 26వ స్థానానికి ఎగబాకిందని, 10.36% వృద్ధితో 91.74% ఉత్తీర్ణత సాధించామని తెలిపారు. ఈసారి కూడా విద్యార్థులు బాగా చదివి ఉత్తీర్ణత శాతం మరింత మెరుగుపరచాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో అందరూ విధిగా యూనిఫాం ధరించాలనీ,అది కులం,మతం, ఆర్థిక స్థాయి అన్న భేదాలను తొలగించి సమానత్వాన్ని తీసుకువస్తుందని పేర్కొన్నారు.

గత సంవత్సరం పదవ తరగతిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సర్టిఫికెట్లు, మిమెంటోలు అందజేసినట్లు గుర్తుచేస్తూ, ఈ సంవత్సరం కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించే వారికి గణతంత్ర దినోత్సవం వేడుకలలో ఘనంగా సన్మానిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సిద్దప్ప, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సంధ్య కిరణ్మయి, ప్రోగ్రామ్ ఆఫీసర్ రిజ్వాన, మెడికల్ ఆఫీసర్లు, పాఠశాల ప్రిన్సిపాల్ జహురుద్దీన్  విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.