calender_icon.png 11 August, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి

11-08-2025 04:57:28 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ఒకటి నుండి 19 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) పిలుపునిచ్చారు. పిల్లల్లో మానసిక, శారీరక పెరుగుదలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మందులు తినిపించారు. కడుపులో నులిపురుగులు ఉండటం వల్ల పిల్లల్లో ఎదుగుదల ఆగిపోతుందని, ఇది రక్తహీనతతో పాటు, కడుపునొప్పి, ఇతర రకాల నొప్పులకు, మానసిక వైకల్యానికి దారి తీసే ప్రమాదం ఉందని, ఎత్తు, బరువు మూర్తిమత్వం ఎదుగుదల ఉండదని, అందువల్ల ఒకటి నుండి 19 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని చెప్పారు.

ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, భోజనం తర్వాత ఈ మాత్రలు వేసుకోవాలని, జిల్లాలో 19 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరికీ నూటికి నూరు శాతం ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆమె ఆదేశించారు. ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీల ఆధ్వర్యంలో డాక్టర్ల పర్యవేక్షణలో ఈ మాత్రలు వేయటం జరుగుతుందని, అందువలన ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, మాత్రలు వేసుకున్న తర్వాత 30 నిమిషాలు పరిశీలనలో ఉంచడం జరుగుతుందని, ఎవరికైనా ఇబ్బందులు ఏర్పడినట్లయితే తక్షణమే వైద్యుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఒకటి నుండి 19 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు నులిపురుగుల నివారణ మందులు ఆల్బెండజోల్ వేయించాలన్నారు. గతంలో ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు ఈ మాత్రలను వేసేదని, ఇప్పుడు సంవత్సరంలో ఒకసారి మాత్రమే వేస్తున్నందున ఎట్టి పరిస్థితులలో ఈ మాత్రలు వేసుకోవడం తప్పిపోకుండా చూడాలని, ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి పిల్లలతో పాటు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.అనంతరం జిల్లా కలెక్టర్ స్వయంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు తినిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ వేణుగోపాల్, రవి,రేణుక, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, జిల్లా మాస్ మీడియా అధికారి తిరుపతి రావ్, ఇతర అధికారులు ,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.