calender_icon.png 11 August, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి సురేఖ ఇంటిని ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు

11-08-2025 05:28:36 PM

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ రామ్ నగర్ లోని తెలంగాణ మంత్రి కొండ సురేఖ(Minister Konda Surekha) ఇంటిని సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు ముట్టడించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర అనే సంస్థకు ఇవ్వద్దని, మధ్యాహ్న భోజన కార్మికులకు పని భద్రత కల్పించడంతో పాటు కార్మికుల సమస్యలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మాధవి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో మంత్రి ఇంటిని ముట్టడించి ఇంటి ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి మాధవి మాట్లాడుతూ కొండ సురేఖ సాటి మహిళలు అని చూడకుండా పోలీసులు పెట్టి తమను అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మధ్యాహ్న భోజన కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.

ఎన్నో సంవత్సరాలుగా అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తున్నామన్నారు.తమ జీవితాలు రోడ్డుపాలు చేయొద్దని మధ్యన భోజన పథక కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు కనీస వేతనం 20 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మధ్యాహ్నం భోజనం బడ్జెట్ కూడా పెంచాలని వారు డిమాండ్ చేశారు. వరంగల్ మండలంలోని మధ్యాహ్న భోజన పథక కార్మికులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా దాదాపుగా 25 సంవత్సరాలుగా వారు పనిచేస్తున్న కూడా వారి శ్రమను పరిగణలోకి తీసుకోకుండా అక్షయపాత్రకు ఇవ్వడం చాలా బాధాకరమని, ఈ దుశ్చర్యను సిఐటియు ఆధ్వర్యంలో ఖండిస్తున్నామని మాధవి డిమాండ్ చేశారు.

అందులో భాగంగానే ఈరోజు కొండా సురేఖ ఇంటిని ముట్టడించడం జరిగింది అన్నారు. మంత్రిగారు మహిళా అయి ఉండి సాటి మహిళలను కూడా చూడకుండా మధ్యాహ్న భోజన కార్మికుల నోట్లో మట్టి కొట్టకూడదని ఆమె అన్నారు. దాదాపుగా అందరూ 55 సంవత్సరాలు పైబడిన మహిళలే ఈ కార్మికులుగా పనిచేస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము స్పందించి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం సుబేదారి పోలీసులు సిఐటియు నాయకులను, మధ్యాహ్న భోజన కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సిఐటియు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.