11-09-2025 04:53:01 PM
మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ డాక్టర్ల హాజరు శాతాన్ని రికార్డులను తనిఖీ చేసి కాంట్రాక్టు డాక్టర్లు విధులలో అలసత్వం వహిస్తున్నారని ఆసుపత్రికి రాకుండానే జీతం తీసుకుంటున్నారని, అలాంటి కాంటాక్ట్ డాక్టర్ల జీతాలలో కోత విధించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రికి వచ్చే రోగుల హాజరు పట్టికను, తనిఖీ చేసి వైద్యులతో మాట్లాడారు. ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని, జనరల్ వార్డును, రక్త నిధి కేంద్రాన్ని తనిఖీ చేసి రోగులకు అందుకున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రక్త నిధి కేంద్రానికి భవన నిర్మాణం పూర్తయిందని, త్వరలో సిబ్బందిని నియమిస్తామని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అనంతరం బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి వసతి గృహానికి ప్రహరీ గోడ నిర్మాణం, కిటికీలు, తలుపులు, మరుగుదొడ్లు, తదితర మరమ్మతుల వెంటనే చేపట్టాలని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక సింగ్, మండల ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్, ఎంపీడీవో రవీంద్రనాథ్, ఆస్పత్రి సూపరిండెంట్ విద్యావతి, ఆర్.ఎం. ఓ.ప్రవీణ్ కుమార్, ఎం.పీ.ఓ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.