29-07-2025 06:27:21 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) మంగళవారం పర్యటించారు. కాళేశ్వరంలోని ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని అక్షయ భౌతిక శాస్త్రంపై న్యూటన్ సిద్ధాంతాలపై, దశావతారంతో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో పాల్గొనడంతో ఈ విద్యార్థిని చేసిన భౌతిక శాస్త్రంలో దశావతారం ప్రదర్శన ఆకట్టుకుందని అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ లో స్థానం దక్కించుకోవడం చాలా సంతోషకరమని తెలిపారు.
ప్రతి విద్యార్థి పాఠశాల స్థాయి నుండి లక్ష్యాలు నిర్దేశించు కొని ఆ లక్ష సాధనకు నిర్విరామంగా కృషి చేయాలి అన్నారు. కష్టమైన భౌతిక శాస్త్రంలో పదిమంది విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మధ్యలో ఇతర అంశాలతో మిళితంగా సమాధానాలు ఇవ్వడమే కాక శాస్త్రవేత్తల పేర్లు చిత్రాలను గుర్తుపెట్టుకుని వివరించడం విధానాన్ని కలెక్టర్ ప్రశంసించారు. భౌతిక శాస్త్రంలో న్యూటన్ గమన నియమాల పై అక్షయ ప్రదర్శించిన దశావతారం మాదిరిగానే సృజనాత్మక ప్రోత్సాహం అందించాలని పేర్కొన్నారు. అనంతరం మహదేవపూర్ ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీలు కను బొమ్మలతో చేసిన కోడింగ్ వీక్షించారు. ఈ టెక్నిక్ ద్వారా మాటలు, పాటలు లేదా సంకేత భాషల అవసరం లేకుండా కేవలం కనుబొమ్మల కదలికలతో ఒకరు వ్రాసిన వాక్యాన్ని మరో విద్యార్థి కనుబొమ్మల ద్వారా గ్రహించి ఖచ్చితంగా చెప్పగలగడం పట్ల చాలా అభినందించారు. అక్షయ్ కు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రశంస పత్రాన్ని, మెడల్ ను అందజేశారు.
ఈ పాఠశాలలోనే ఇటీవల ముగ్గురు విద్యార్థులు కోల శాన్వి, గంట హరిచందన, నాగుల తులసి విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలలకు ఎంపికైన సందర్భంగా విద్యార్థినీలను సన్మానించారు. జులై 1న హైదరాబాదులో హకింపేట క్రీడా పాఠశాలలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో పాల్గొని మన జిల్లా నుండి ఈ ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం పట్ల అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. ఈ ముగ్గురు విద్యార్థులు అథ్లెటిక్ విభాగంలో ప్రతిభ కనబరిచారని తెలిపారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ ఆరోగ్య కేంద్రం ద్వారా అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన వ్యర్థాల దహన వాటిక ను పరిశీలించి దహన ప్రక్రియ నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి సరస్వతి ఘటు వద్ద గోదావరి ఉధృతిని పరిశీలించారు. పరిశుభ్ర పై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అంటు వ్యాధులు బారిన పడకుండా ప్రజలకు తగు జాగ్రత్తలు తెలియజేయాలని. జ్వర సర్వే ఇంటింటికి నిర్వహించాలని ఆదేశించారు. వసతి గృహ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ తయారుచేయాలని అన్నారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నందున భక్తులు గోదావరి లోకి వెళ్లి స్నానాలు చేయకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు మెట్ల పైనే స్నానాలు చేయాలని గోదావరి వద్ద గట్టి పటిష్ట నిగా ఉంచాలని దేవాలయ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, రాష్ట్ర కోఆర్డినేటర్ సిద్ధం అరుణ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు రాజేందర్, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, డాక్టర్ సుస్మిత, దేవస్థానం ఈవో మహేష్, తాసిల్దార్ రామారావు ఎంఈఓ ప్రకాష్ బాబు, మడక మధు, తదితరులు పాల్గొన్నారు.