20-12-2025 08:56:31 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ్ ఎవం హరిత్ విద్యాలయ రేటింగ్-2025-26 కార్యక్రమంలో జిల్లాలోని పాఠశాలలు ప్రతిష్టాత్మక గుర్తింపు సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో ప్రత్యేక గుర్తింపు పొందిన పాఠశాలల ప్రతినిధులకు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి తో కలిసి ధ్రువపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర విద్యా శాఖ నిర్వహించిన రేటింగ్ కార్యక్రమంలో జిల్లాలోని సావర్కడే గ్రామ ప్రధానమంత్రి శ్రీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, చిన్న రాసిపెల్లి గ్రామంలోని ప్రధానమంత్రి శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రెబ్బెన, కౌటాల మండలాలలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, దహేగాం మండలం రాంపూర్ గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, నాగేపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కాగజ్ నగర్ లోని అరుణోదయ ఉన్నత పాఠశాలలు ప్రత్యేక గుర్తింపు సాధించాయని తెలిపారు.
విద్యా సంస్థలు కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, హరిత జీవన విధానాలపై విద్యార్థులలో అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని, స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో బాధ్యతాయుత పౌరులుగా మారే లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. నీటి వినియోగంలో మిత వ్యయం, మరుగుదొడ్ల నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ప్రవర్తన మార్పు, మిషన్ లైఫ్ కార్యక్రమాల అమలులో పాఠశాల అత్యుత్తమ ప్రమాణాలు సాధించి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ సి ఎం ఓ కటుకం మధుకర్, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాలల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.