03-07-2025 05:01:03 PM
పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభంలో జిల్లా ఎస్పీ...
నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): మల్టీ జోన్-2 పరిధిలోని అన్ని విభాగాల పోలీస్ అధికారుల పనితీరు, వారిలోని నైపుణ్యం పెంపొందించేందుకు జోనల్ పోలీస్ డ్యూటీ మీట్(Police Duty Meet-2025) ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్(District SP Gaikwad Vaibhav Raghunath) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ప్రాంగణంలో పోలీస్ జాగిలాలు, బాంబు స్క్వార్డ్, డాగ్ స్క్వార్డ్, ఫింగర్ ప్రింట్ విభాగం పనితీరు వాటిపై పోటీలు నిర్వహించారు. ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులకు నైపుణ్య పరీక్షలను నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రారంభించారు. ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జోన్‌కు చెందిన నారాయణపేట, గద్వాల్, వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల నుండి వచ్చిన 150 మంది అధికారులు వివిధ విభాగాలలో పోటీల్లో పాల్గొన్నారు. ఈ నెల 4న జరగనున్న ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఐజీ ఎల్. ఎస్. చౌహన్ హాజరు కానున్నట్లు తెలిపారు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అధికారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కానున్నట్లు తెలిపారు.