03-07-2025 11:36:25 PM
సమయస్ఫూర్తితో కాపాడిన సిద్దిపేట టూ టౌన్ పోలీసులు..
సిద్దిపేట (విజయక్రాంతి): కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉరివేసుకున్న మహిళను సిద్దిపేట టూ టౌన్ పోలీసులు(Siddipet Two Town Police) సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాలు కాపాడిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. కరీంనగర్ రోడ్, సిసి గార్డెన్ వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి కనకవ్వ(38), భర్త శ్రీనివాస్ తో కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. తన పరిస్థితిని హైదరాబాదులో ఉన్న కూతురికి ఫోన్ ద్వారా తెలియజేయగా, ఆ విషయం తెలుసుకున్న కుమార్తె వెంటనే సిద్దిపేటలోని బంధువులకు సమాచారం ఇచ్చింది.
బంధువులు హుటాహుటిన టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగా, ఇన్‌స్పెక్టర్ ఉప్పందర్ నాయకత్వంలోని పోలీస్ బృందం, ఐటీ కోర్ సిబ్బంది సహకారంతో ఫోన్ లోకేషన్ ద్వారా ఆమె ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులు లోపల నుంచి లాక్ కావడంతో అవి బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించి, ఉరిలో వేలాడుతున్న కనకవ్వను సజీవంగా బయటికి తీశారు. ఈ ఘటనలో ప్రాణాపాయం నుండి ఆమెను రక్షించిన టూ టౌన్ పోలీసుల వేగవంతమైన చర్యపై ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సమయాన్ని వృథా చేయకుండా, అత్యంత చురుకుగా స్పందించిన టూ టౌన్ పోలీసులు నిజంగా అభినందనీయులు అని స్థానికులు అభిప్రాయపడ్డారు.