calender_icon.png 4 July, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమిస్తాపూర్ లో లోకాయుక్త విచారణ..

03-07-2025 11:42:42 PM

జాగృతి ఎన్ క్లేవ్ వెంచర్ పై లోకాయుక్త డీఎస్పీ విద్యాసాగర్ వివరాల సేకరణ...

భూత్పూర్: అన్యాయాన్ని ఆపాలంటూ ఇటీవల కాలంలో లోకాయుక్తకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ మున్సిపాలిటీ(Bhoothpur Municipality) పరిధిలోని అమిస్తాపూర్ ప్రాంతంలో సర్వేనెంబర్ 372, 375, 458, 457 లోని భూములలో జాగృతి ఎంక్లేవ్ వెంచర్ అక్రమంగా చేశారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సర్వే నెంబర్ లపై భూములను, పంచాయతి రాజ్ రోడ్లను, దేవదాయ శాఖ, భూదాన్, అసైన్డ్ భూములను ఆక్రమించి వెంచర్ ఏర్పాటు చేశారని గత రెండు సంవత్సరాల క్రితం అమిస్తాపూర్ కు చెందిన కేద్యాల నరేందర్, శ్రీశైలం, ఎన్ చంద్రశేఖర్, సునీల్ కుమార్ లు రాష్ట్ర లోకాయుక్త కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు లోకాయుక్త డీఎస్పీ అధికారి విద్యాసాగర్ గురువారం భూత్పూర్ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్ గ్రామానికి చేరుకొని విచారణ చేశారు. ఈ ఎంక్లేవ్ ప్రక్రియపై ఇప్పటికే పలుమార్లు మున్సిపల్ అధికారులను, రెవిన్యూ అధికారులతో పాటు తాహసిల్దార్లను హైదరాబాద్ లోని రాష్ట్ర లోకాయుక్త కార్యాలయం జడ్జి ముందు అనుమతులు ఇచ్చిన ఆధారాలతో హాజరుకావాలని నోటీసు ద్వారా లోకాయుక్త ఆదేశించింది. స్పందించిన అధికారులు పలుమార్లు జాగృతి వెంచర్ యజమానులు ఇచ్చిన పత్రాలు లోకాయుక్త ముందు ఉంచారు.  ఈ వివరాలు అన్నీ పరిగణలోకి తీసుకున్న లోకాయుక్త పూర్తి స్థాయిలో సమగ్ర సమాచారం తెలుసుకోవాలంటే నేరుగా విచారణ చేయాలని అంశాన్ని పరిగణలోకి తీసుకొని తమ విచారణ ప్రారంభించింది.  

సమగ్ర సమాచారం ఇవ్వండి...: లోకాయుక్త

గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారులని పిలిపించి అమిస్తాపూర్ లోని సంబంధిత భూముల దగ్గరికి లోకాయుక్త డిఎస్పి బాధితులు అయిన నరేందర్, తిరుపతయ్య, చంద్రశేఖర్, బర్ల రామచంద్రయ్యలు గ్రామ నక్ష ప్రకారం కాకుండా సర్వే నెంబర్ల 376, 403 భూములలో అక్రమంగా రోడ్డు నిర్మించారని అధికారికి విన్నవించారు. చుట్టూ కాంపౌండ్ ఏర్పాటు చేసుకొని పొలాలకు బాట లేకుండా పోయిందని మరికొంత మంది రైతులు తెలియజేశారు. మరో పక్క సర్వే నెంబర్ 371 ప్రభుత్వ అసైన్డ్ భూమిలో దళితులకు ప్రభుత్వం కోళ్ల ఫారం నిర్మించి పట్టాలు ఇచ్చిందని, ఈ భూమిలో కొంతమేర జాగృతి వెంచర్ యజమానులు ఆక్రమణకు గురి చేశారని గడ్డం బలరాం విచారణ అధికారులకు తెలిపారు.

మరో పక్క ఫ్లాట్ల యజమానులు 373 సర్వే నెంబర్లు భూదాన భూమిని కబ్జా చేసి వెంచర్ ఏర్పాటు చేసుకున్నారని, వీటితో పాటు మరో వెంచర్ లో ఉన్న రోడ్డును చూయించి ప్రధాన రహదారి 33 ఫీట్లు ఉన్నట్లు లేఔట్ లో చూపించారని వీటితో పాటు రెండు ప్లాట్లను కూడా ఆక్రమించి ఈ వెంచర్ను ఏర్పాటు చేశారని అధికారులకు ఫిర్యాదు చేశారు. మరోపక్క 362 సర్వే నెంబర్లు దేవదాయ శాఖ భూములను కూడా వెంచర్లో ఆక్రమించుకున్నారని గ్రామస్తుడు నరేందర్ పంచనామ రిపోర్టులో లిఖితపూర్వకంగా సంతకాలు చేసి విచారణ అధికారి డీఎస్పీ విద్యాసాగర్ కు ఫిర్యాదు చేశారు. 

అధికారులపై లోకాయుక్త కు మరో మారు ఫిర్యాదు..

తప్పుడు పత్రాలను ఆధారంగా చేసుకుని అక్రమ వెంచర్ చేసేందుకు సహకరించిన ఉన్నత అధికారులపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్త డిఎస్పి విద్యాసాగర్ కు అమిస్తాపూర్ గ్రామస్తులు నేరుగా ఫిర్యాదు చేశారు. ప్రక్రియలో సహకారం అందించిన అప్పటి జిల్లా ఉన్నత అధికారులతో పాటు, మండల రెవెన్యూ, మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారి కోరారు. డిటిసిపి లేఔట్ లకు నకిలీ పత్రాలతో అనుమతులు ఇచ్చారని గతంలో బాధితులు ఫిర్యాదు చేశామని, రికార్డులు పరిశీలించి అక్రమాలకు కబ్జాలకు పాల్పడ్డ వెంచర్ యజమానులపై సమగ్ర విచారణ చేసి అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు నేరుగా లోకాయుక్తకు మరో మారు ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.