calender_icon.png 12 December, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాల్లో ఆకస్మత్తుగా వచ్చే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి

12-12-2025 06:07:33 PM

అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్.ఖీమ్య నాయక్

వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాల్లో అకస్మాత్తుగా వచ్చే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు  లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా ఇచ్చే శిక్షణ, సూచనలు సలహాలు అమలు చేస్తామని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్.ఖీమ్య నాయక్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆకస్మికంగా వచ్చే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ నుండి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ తో పాటు జిల్లా లైన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

అకస్మాత్తుగా వచ్చే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యవస్థ ఉండాలి, ముందస్తు ఏర్పాట్లు బాధ్యతలు ఏవిధంగా ఉండాలి అనే విషయాల పై జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నుండి రిటైర్డు మేజర్ జనరల్ సుధీర్ భాల్ అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అకస్మాత్తుగా భారీ వరదలు, భూమి కొట్టుకోవడం, పరిశ్రమలు, భారీ భవంతుల్లో ఆకస్మికంగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడం వంటి ముప్పు ఉండే ప్రాంతాలు ఉన్నాయని, ఎలాంటి విపత్తు వచ్చిన అత్యల్పంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగే విధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

యంత్రాంగంలో అధికారుల బాధ్యత ఏ విధంగా ఉండాలి అనే విషయాల పై అవగాహన కల్పించారు.  రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, ఎన్.డి.ఆర్.ఎఫ్. , ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీస్, ఫైర్ అధికారులతో డిసెంబర్ 17 నుండి 22 వరకు హైదరాబాద్ లో వర్క్ షాప్ నిర్వహించి మాక్ వ్యాయామం చేయనున్నట్లు తెలియజేశారు. ఈ మాక్ ఎక్సర్సైజ్ లో అధికారుల బాధ్యత, వారు నిర్వహించాల్సిన బాధ్యతల పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ మధ్య కాలంలో తరచుగా భారీ వర్షాలు, వరదలు రావడం, భూమి కొట్టుకోవడం, భూకంపాలు, సునామీలు వస్తున్నాయి.

ఇలాంటి విపత్తులు ఆకస్మికంగా వచ్చినప్పుడు ప్రాణనష్టం జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత యంత్రాంగం పై ఉంటుందన్నారు. ఇందుకు మౌలిక సౌకర్యాలు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం, అధికారులకు వారి బాధ్యతల పై స్పష్టమైన అవగాహన ఉండటం చాలా అవసరం అన్నారు.  అందుకే సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో మాక్ డ్రిల్ నిర్వచాలనుకున్నట్లు తెలియజేశారు. రాష్ట్రం నుండి పోలీస్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ ఇతర శాఖల ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.